మూసీ ప్రక్షాళన తప్ప ప్రత్యామ్నాయం లేదు
దేశస్థాయి ప్రమాణాలతో 10+2 పద్ధతిలో విద్యా విధానం
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు యథాతథమే
మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో లేదు
అజహరుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో
చట్ట ప్రకారమే ఫార్ములా–ఈ, ఫోన్ ట్యాపింగ్ విచారణ
రూ. 3.47 లక్షల కోట్లు అప్పులు తెచ్చాను..
అందులో రూ. 3.30 లక్షల కోట్లు అప్పులు కట్టేందుకే
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్‌కు ఎదిగారని గుర్తు చేశారు.
చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్‌పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్‌లో ఆయన మీడియాతో ‘చిట్‌చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....
పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్‌ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది.
మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్‌జోన్‌లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్‌హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్‌లో పెట్టినం.
రేషన్‌కార్డు ఉంటేనే...
రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్‌కార్డు ఒక్కటే కొలమానం.
తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు
తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది.
రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం
మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం.
చట్టపరంగానే విచారణ
ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్‌రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్‌టాపింగ్ కేసులో క్లీన్‌చిట్ ఇచ్చినట్టు హరీశ్‌రావు చెబుతుండడం తప్పు. చక్రధర్‌గౌడ్ పంజగుట్ట పీఎస్‌లో తనను హరీశ్‌రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్‌రావు బెదిరించినట్టు చక్రధర్‌గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్‌ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్‌రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్‌లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా.
హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా
హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్‌కు మార్చుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్‌ఎంసీలో ఓఆర్‌ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం.
భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు.
బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదు
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్‌లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్‌రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది.


