రెవెన్యూలో నవశకం

CM KCR To Launch Dharani Land Records Portal In Muduchintalapalli - Sakshi

సీఎం చేతుల మీదుగా నేడు ధరణి ప్రారంభం

అవినీతికి అడ్డుకట్ట.. పారదర్శకతకు పెద్దపీట 

తహసీళ్లలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టలే భూ హక్కు రికార్డుగా పరిగణన

రెవెన్యూలో కీలక సంస్కరణలు

నేటి నుంచి మనుగడలోకి కొత్త రెవెన్యూ చట్టం 

భూ రికార్డుల నిర్వహణ

ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌)

రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు... 

భూ పరిపాలనలో కీలక మార్పులకు ధరణి వేదిక కానుంది. భూ రికార్డుల నిర్వహణ, ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌), రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు... భూ పరిపాలనలో ఈ మూడు ప్రధానం. ఇకపై వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం ధరణి. ఈ పోర్టల్‌నే భూ హక్కుల రికార్డుగా పరిగణిస్తూ కొత్త చట్టంలో పేర్కొన్నందున ఇప్పటివరకు ఉన్న మాన్యువల్‌ రికార్డులు అప్రాధాన్యం కానున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్‌ను గురువారం రైతు ముంగిట్లోకి తెస్తోంది. అధికార అంచెల్లో... అధికారాల్లోనూ కోత విధిస్తూ రూపొందించిన భూ హక్కులు, పాస్‌ పుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్‌) నేటి నుంచి మనుగడలోకి రానుంది. ఇన్నాళ్లు కొనసాగిన మాన్యువల్‌ రికార్డులకు ముగింపు పలుకుతూ, డిజిటల్‌ ఆధారిత భూ రికార్డుల నిర్వహణకు నడుం బిగించింది. అవినీతి వేళ్లూనుకున్న రెవెన్యూ శాఖను సమూలంగా సంస్కరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్వోఆర్‌ 1971 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూలో ప్రజలకు సులభతర సేవలందించే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పహాణీ, సేత్వార్‌ల నకలు కావాలన్నా.. పైసలిస్తే కానీ పని కాదనే ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. ఇక రికార్డులను ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా ధరణిని అందుబాటులోకి తెచ్చారు. గ్రామస్థాయిలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సర్కారు.. అప్పీలేట్‌ ఆథారిటీని ఎత్తివేసి ఆర్డీవోలను నామ్‌కే వాస్తే గా మార్చింది. దీంతో రెవెన్యూలో ఇకపై మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలోని విభాగాలే క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి.

భూ రికార్డుల నిర్వహణ
కేవలం కంప్యూటర్‌ ఆధారిత భూ రికార్డులను మాత్రమే నిర్వహించే రెవెన్యూశాఖ... మ్యాన్యువల్‌ రికార్డుల నిర్వహణ నుంచి తప్పుకోనుంది. పహానీ నకలును పొందేందుకు రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సిబ్బంది చేతులు తడిపితే కానీ రికార్డు చేతికందేది కాదు. ఈ పరిస్థితి నుంచి రైతులకు ఊరట కలుగనుంది. ఆన్‌లైన్‌లోనే భూ రికార్డులను ఎప్పుడైనా చూసి తెలుసుకునే వీలు కలుగనుంది. ఒకే భూమికి వేర్వేరు రికార్డులు చూపుతున్న తరుణంలో ధరణితో ఈ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఇకపై అది ప్రైవేటా, ప్రభుత్వ భూమా అనేది ఇట్టే తెలిసిపోనుంది. తద్వారా భూ హక్కులపై సందిగ్థతకు తెరపడనుంది.

రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌
ప్రస్తుతం భూ హక్కులు పొందినా... రికార్డులకెక్కడానికి 2 నుంచి 6 నెలల సమయం పడుతోంది. మ్యుటేషన్, పాస్‌ పుస్తకాల జారీలో జరిగే జాప్యానికి ‘ధరణి’తో ముగింపు పడనుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లే నిర్వహిస్తుండడం.. అక్కడికక్కడే రికార్డుల అప్‌డేషన్, పీపీబీ జారీ, మ్యుటేషన్‌ ప్రక్రియ కూడా అర గంటలొనే పూర్తి కానుంది. ధరణి దేశానికే దిక్సూచిలా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్ల నిర్వహణను ప్రభుత్వం సులభతరం చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయడం.. రెవెన్యూ కార్యాలయాలకు డేటా అనుసంధానించకపోవడం, రికార్డుల బదలాయింపులో తీవ్ర జాప్యం జరగడం, భూ హక్కుల పరిశీలనాధికారం ఎస్‌ఆర్వోలకు లేకపోవడం, డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరగడంతో భూ వివాదాలకు ఆజ్యం పోసింది. వీటిన్నింటికి మంగళం పాడేలా.. సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం తహసీల్దార్లకే కట్టబెట్టారు. దీంతో కేవలం డీడ్‌లే గాకుండా.. హక్కులపై కూడా వారికి సంపూర్ణమైన అవగాహన కలుగనుంది. ధరణిలో ఉన్న రికార్డుల మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నందున తగాదాలకు చోటుండదు. 

అధికారులకు పవర్‌కట్‌
రెవెన్యూ వ్యవహారాల్లో అధికారులకు ఎలాంటి అధికారులుండవు. తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ సేవలు, నాలా అధికారాలకే పరిమితం కానుండగా.. ఆర్డీవోల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ కోర్టుల రద్దుతో తహసీల్దార్లు, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల నుంచి రెవెన్యూ అధికారాలను పూర్తిగా తొలగించిన ప్రభుత్వం... కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్లకు కాస్తో కూస్తో అధికారాలు, బాధ్యతలు అప్పగించినా, ఆర్డీవో విధులను నిర్వచించలేదు. దీంతో ఆర్డీవోలు ఇకపై భూ సేకరణ, కలెక్టర్‌ సూచనల మేరకు అదనపు సేవలు అందించాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు చేసినందున వీరి సేవలను ఎక్కడ వినియోగించుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. 

మూడుచింతలపల్లిలో ప్రారంభం
సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్‌ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్‌లో ఉన్న పార్ట్‌ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top