ప్రతి గింజా మేమే కొంటాం: సీఎం కేసీఆర్‌

Cm Kcr Comments About Paddy Procurement In Meeting Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కుంటిసాకులు చెపుతూ వెనకడుగు వేస్తున్నందున రైతుల ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘తెలంగాణ రైతాంగానికి మేం అండగా ఉంటాం. యాసంగిలో పండిన పంట చివరి గింజ వరకు మేమే కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో ఆర్థిక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల కార్యదర్శులతో కమిటీ వేసి తక్కువ నష్టంతో ధాన్యం కొనుగోలుకు ఏం చేయాలో నిర్ణయిస్తాం.

బుధవారం నుంచే కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 3, 4 రోజుల్లో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక క్వింటాల్‌కు రూ.1,960 కన్నా తక్కువకు ఏ రైతూ ధాన్యం అమ్మొద్దు. దిక్కుమాలిన కేంద్రం చేతులెత్తేసినంత మాత్రాన మేం వెనక్కుపోం..’ అని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. నూకల వల్ల పడే రూ.3 వేల కోట్ల నుంచి రూ.3.5 వేల కోట్ల భారాన్ని తామే భరించడానికి ముందుకు వచ్చామన్నారు. ‘ఉచిత విద్యుత్‌కు రూ.12 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు, రైతుబీమాకు రూ.1,600 కోట్లు భరిస్తున్న మేం రూ.3, 4 వేల కోట్లకు వెనక్కుపోతమా? ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటది. ఏర్పాట్లన్నీ మంత్రి గంగుల కమలాకర్‌ చూస్తారు. మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును నేటి నుంచే పర్యవేక్షించాలి..’అని కేసీఆర్‌ చెప్పారు. 

కేంద్రం తీరును ఎండగట్టినం
    ‘ఇటీవల ఆదానీ గ్రూపునకు కేంద్రం రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది. కార్పొరేట్‌ కంపెనీలకు ఇప్పటిదాకా రూ.10.50 లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం రూ.3 వేల కోట్లు భరించే స్థితిలో కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం లేదు. కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉన్నదని చెప్పి యాసంగిలో 20 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గించినం. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీదని గుర్తు చేయడం మా బాధ్యత. అందుకే గొడవ చేసినం. ఢిల్లీ వేదికగా అడిగినం. దోషిగా నిలబెట్టినం. ఒక రాష్ట్రానికి న్యాయం చేసే దమ్ము లేదా? మనసు లేదా ? అని నిలదీసినం. భారత రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగట్టినం. ఆహారభద్రత చట్టం అమలు బాధ్యత నుంచి కేంద్రం వెనక్కి వెళ్లిన తీరును దేశమంతా గుర్తించింది..’అని సీఎం అన్నారు. 

జలాశయాల పరిరక్షణకు కమిటీ
    ‘రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో 111 జీవో కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని అభిప్రాయపడిన కేబినెట్‌ ఈ జీవోను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఎంతో కాలంగా ఆ జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విన్నపాల మేరకు 111 జీవో రద్దుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా జలాశయాల పరిరక్షణ కోసం నియమ నిబంధనలతో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాం. మూసీ, ఈసా నదులు, జంట జలాశయాల్లోనూ కాలుష్య జలాలు చేరడానికి వీల్లేకుండా కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖల ద్వారా పరిరక్షిస్తాం..’అని సీఎం చెప్పారు.

వర్సిటీల్లో 3,500 పైచిలుకు నియామకాలు
    ‘విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలను కామన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ద్వారా జరపాలని కేబినెట్‌ నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలే నియామకాలు జరుపుకునే విధానం కాకుండా విద్యా శాఖ ద్వారా పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరుపుతాం. 3,500 పైచిలుకు టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాలను చేపడతాం..’అని తెలిపారు. 
రాష్ట్రంలో ఆరు ప్రైవేటు యూనివర్సిటీలు
►  ‘తెలంగాణలో మరో ఆరు కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కావేరి అగ్రికల్చర్‌ యూనివర్సిటీతో పాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ), గురునానక్, నిప్‌మర్, ఎంఎన్‌ఆర్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇటీవల మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయి. సివిల్‌ ఏవియేషన్‌ కోర్సులకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తర్వాత అతిపెద్ద విమానాశ్రయం హైదరాబాదే. విమానాశ్రయంలో ఉత్తరం వైపు రన్‌వేను నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ’అని ముఖ్యమంత్రి వివరించారు. 

ఇతర జిల్లాలకు విద్యాసంస్థల విస్తరణ
    ‘విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఇతర నగరాలకు విస్తరింప చేయాలి. దీనివల్ల హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు, ఇతర నగరాలు అభివృద్ధి చెందుతాయి..’అని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రిని కేబినెట్‌ ఆదేశించింది.

ఇతర నిర్ణయాలు
► మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగు, తాగునీరు అందించే ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1,658 కోట్లు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల గోదావరి నీటిని ఈ పథకానికి వినియోగించనున్నారు. 
►మే 20 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలి.
►ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఆమోదం.
► వైద్య కళాశాలల ప్రొఫెసర్లను వైద్య విద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్లుగా నియమించేందుకు అనుమతి.
► రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిలో 3 సంవత్సరాలు సడలింపు. 
► గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, ఇతర గెజిటెట్‌ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇకపై కేవలం లిఖిత పరీక్షనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఉండదు.
► ఐటీ తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాంతాలకే పరిమితం కాకూడదు. ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలి. తద్వారా హైదరాబాద్‌ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top