రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటనకు (Chevella Bus Accident) టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ కారణమని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. పరిమితికి మించి కంకర నింపుకుని, మితిమీరిన వేగంతో వెళుతూ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోగా, 32 మంది వరకు గాయపడినట్టు సమాచారం.
మరోవైపు రోడ్డుపైన ఉన్న భారీ గుంత (గొయ్యి) కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టాడని అంటున్నారు. ఢీకొట్టిన వెంటనే టిప్పర్.. బస్సుపైకి ఒరిగిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్‌లోని కంకర.. ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికులపై పడడంతో వారిలో చాలా మంది ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్‌లో 35 టన్నుల కంకర ఉండాల్సి ఉండగా 60 టన్నుల కంకర ఉన్నట్టు తెలుస్తోంది.
బస్సు డ్రైవర్ వైపు సీట్లు అన్ని నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ఈ వరుసలోని వారందరూ దాదాపు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు పురుషులు ఉన్నారు.
చదవండి: అలా ప్రమాదం నుంచి బయటపడ్డాను
ప్రమాదానికి కారణాలు
1. టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్
2. రోడ్డుపైన భారీ గుంత
3. టిప్పర్‌లో పరిమితికి మించిన కంకర
4. గొయ్యి రావడంతో తప్పిన టిప్పర్ కంట్రోల్
5. టిప్పర్‌లోని కంకరపై టార్పాలిన్ లేకపోవడం
6. టిప్పర్‌లోన కంకర మొత్తం బస్సుపై పడడం
7. బస్సులో సీట్లకు మించి ప్రయాణికులు
					
					
					
					
						
					          			
						
				
 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
