ఉత్తర ‘రింగు’.. రైట్‌ రైట్‌ | Central Govt Approved PPPAC For Regional Ring Road | Sakshi
Sakshi News home page

ఉత్తర ‘రింగు’.. రైట్‌ రైట్‌

May 4 2026 1:29 AM | Updated on May 4 2026 1:29 AM

Central Govt Approved PPPAC For Regional Ring Road

రూ.23,935.60 కోట్ల బడ్జెట్‌కు కేంద్రం ఆమోద ముద్ర  

టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించుకునే వీలు 

తొలుత రూ.15 వేల కోట్ల వ్యయమే అంచనా.. ఇప్పుడు రూ.9 వేల కోట్ల మేర పెంపు 

మొత్తం నిడివి 161.518 కి.మీ.. 2 ప్యాకేజీలుగా పనులు 

ఆరు వరసల రోడ్డు.. 100 నుంచి 90 మీటర్ల వెడల్పునకు అలైన్‌మెంటు తగ్గింపు 

మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐకి ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది. భారీ జాప్యం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలోని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఉత్తర భాగం బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసి, అనుమతులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 8 నెలలుగా పెండింగులో ఉన్న టెండర్లను తెరిచేందుకు మార్గం సుగమం అయ్యింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ, రోడ్డు నిర్మాణానికి వీలుగా ఎలాంటి పురోగతి లేక ప్రాజెక్టు దాదాపు ఏడాదిగా  పెండింగులో ఉంది.  

భారీగా పెరిగిన బడ్జెట్‌ 
తొలుత రూ.15 వేల కోట్లతో 161.518 కి.మీ. నిడివితో ఉత్తర భాగాన్ని నిర్మించనున్నట్టు అంచనాలు రూపొందించినప్పటికీ, తాజాగా పీపీపీఏసీ ఏకంగా రూ.23,935.60 కోట్ల బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అంటే అంచనాలు దాదాపు రూ.9 వేల కోట్ల మేర పెరిగిపోయాయి. కాగా మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జాప్యం జరిగితే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే దక్షిణ భాగం నిర్మాణానికి రూ.35 వేల కోట్ల వ్యయమయ్యే అవకాశం కన్పిస్తోంది. దక్షిణ భాగం విషయంలో ఇంకా అలైన్‌మెంటు కూడా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 208 కి.మీ.తో ఓ అలైన్‌మెంటును రూపొందించినా, ఎన్‌హెచ్‌ఏఐ దాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఖరారై డీపీఆర్‌ సిద్ధమైతే వ్యయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  


ఉత్తర భాగం రెండు ప్యాకేజీలుగా.. 
ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగం మొత్తం నిడివి161.518 కి.మీ.లు. తొలుత 8 వరసలతో నిర్మించాలని భావించినప్పటికీ, 6 వరసలకే ప్రస్తుతం కేంద్రం పరిమితం చేసింది. దీనిని రెండు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ప్యాకేజీ–1 కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వరకు (83.518 కి.మీ) నిర్మిస్తారు. ప్యాకేజీ–2 కింద ప్రజ్ఞాపూర్‌ నుంచి యాదాద్రి–భువనగిరి జిల్లా తంగేడ్‌పల్లి గ్రామం వరకు (78 కి.మీ.లు) వరకు నిర్మిస్తారు. 

90 మీటర్ల వెడల్పే.. 
తొలుత 8 వరసల రోడ్డుగా ప్రతిపాదించడంతో ఎన్‌హెచ్‌ఏఐ 100 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంటును రూపొందించి, 1,933 హెక్టార్ల భూమి కావాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు భూమిని అప్పగించింది. తర్వాత రోడ్డును 6 వరసలకే కుదించటంతో, ఇప్పుడు 90 మీటర్ల వెడల్పు అలైన్‌మెంటు సరిపోతుందని కేంద్రం తేచ్చింది. మిగిలే 10 మీటర్ల అలైన్‌మెంటు భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ వినియోగానికి అప్పగించాలని నిర్ణయించింది.  

హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌ 
ఉత్తర భాగం కోసం పీపీపీ, బీఓటీ నిర్మాణ పద్ధతులను పరిశీలించి చివరకు హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌ను ఎంపిక చేశారు. కేంద్రం 40% నిధులు నిర్మాణ సంస్థకు చెల్లించనుండగా, 60% నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకోనుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల కాలానికి ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement