వేడెక్కిన హుజూరాబాద్‌.. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పదవీ విరమణతో కొత్త సంకేతాలు

BJP Leader Etela Rajender Padayatra In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్‌ఎస్, బీజేపీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న తీరును చూ స్తే వీలైనంత త్వరలోనే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం కమలాపూర్‌ మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించి ఉప ఎన్నికకు సైరన్‌ ఊదారు. మరోవైపు తెలంగాణ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించి వేడి పెంచారు.

ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల ఉంటారని ఇప్పటివరకు భావించగా.. అవసరమైతే ఆయన సతీమణి జమున కూడా పోటీలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం ఆమె ‘మా ఇద్దరిలో ఎవరు పోటీ చే సినా ఒకటే’ అని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. అధికార పార్టీ వ్యూహాలకు అనుగుణంగా ఈటల కూడా హుజూరాబాద్‌లో పా వులు కదుపుతున్నట్లు జమున మాటలతో అర్థమవుతోంది. అదే సమయంలో అధికార టీఆర్‌ఎస్‌ విజయమే లక్ష్యంగా కదుపుతున్న పావులు రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

దళితుల సాధికారత కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కొత్త పథకం ‘తెలంగాణ దళిత బంధు’ ప్రకంపనలు సృష్టిస్తోంది. హుజూరాబాద్‌ ఎన్నికనే లక్ష్యంగా చేసుకొని ఈ పథకానికి హుజూరాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నా.. తప్పు పట్టే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయలేకపోతోంది. హుజూరాబాద్‌లో ఉన్న సుమారు 21 వేల దళిత కుటుంబాల్లో అర్హులైన వారందరికీ తలా రూ.10 లక్షలు ప్రభుత్వం ద్వారా ఇప్పించి, వారిని వివిధ రంగాల్లో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పథకాలను హుజూరాబాద్‌ నుంచే ప్రారంభించే ఆనవాయితీని కొనసాగిస్తున్నట్లు పైకి కనిపించినా.. అధికార పార్టీ రాజకీయ వ్యూహం ప్రత్యర్థి పార్టీలను కలవరపెడుతోంది.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పదవీ విరమణ సంకేతమా..?
రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా, స్వెరోస్‌ చైర్మన్‌గా కొన్నేళ్లుగా సేవలందిస్తున్న ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ఐపీఎస్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అకస్మాత్తుగా ఆయన పదవీవిరమణకు కారణాలేంటనే విషయంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయనను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

జిల్లాలో నిషేధిత పీపుల్స్‌వార్‌ సంస్థ బలంగా ఉన్న సమయంలో కరీంనగర్‌ ఎస్‌పీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారనే పేరుంది. ‘మా ఊరికి రండి’ నినాదంతో హుజూ రాబాద్, కమలాపూర్, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారని చెపుతారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను సైతం ఈ నినా దం ద్వారా పనిచేసే ఊళ్లలోనే ఉండేలా చైతన్యం తీసుకొచ్చారని సమాచారం. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర ఆయన సొంతం.

ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో ప్రవీణ్‌కుమార్‌ను పోటీలో నిలిపితే జనరల్‌ సీటులో దళిత వర్గానికి ప్రాతినిథ్యం కల్పించిన విశేషం కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దళిత బంధు పథకం ద్వారా ఆ వర్గానికి చేరువవుతున్న నేపథ్యంలో దళితులను ఏకతాటిపై నిలిపేందుకు కృషి చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను అభ్యర్థిగా నిలిపితే సత్ఫలితం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఒకవేళ అభ్యర్థి కాలేని పక్షంలో దళితబంధు పథకానికి చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. 

మోహరిస్తున్న మంత్రులు.. టీఆర్‌ఎస్‌ సంబరాలు
► దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌  నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌   నిర్ణయించడంతో టీఆర్‌ఎస్‌లో కొత్త    ఉత్సాహం మొదలైంది.
 ఆ పార్టీ నేతలు హుజూరాబాద్‌లో      మోహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్నారు.
 కరీంనగర్, హుజూరాబాద్‌లలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగాయి.
 దళిత, బీసీ వర్గాల ఓట్లే టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌లో ఆడుతున్న రాజకీయ చదరంగాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
► ఇటీవల టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణను టీఆర్‌ఎస్‌లోకి తీసుకోవడం ద్వారా 25 వేలకు పైగా ఉన్న చేనేత ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకంతో దళితుల ఓట్లను గులాబీ దండగా మార్చారనే భావన స్థానికంగా నెలకొంది.
 ‘టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే’ అనే ఫోన్‌ సంభాషణ లీకవడంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్‌      నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధమయ్యారు.
 తెలంగాణ భవన్‌లో ఆయన పెద్ద ఎత్తున అనుచరగణంతో పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.
 టికెట్టు విషయంలో ఎలాంటి హామీ లేకుండానే గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 

త్వరలోనే హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్‌
‘తెలంగాణ దళితబంధు’ను హుజూరా బాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు త్వరలో సీఎం కేసీఆర్‌ ఇక్కడికి రానున్నారు. ఈలోపు దళితబంధు విధివిధానాల రూపకల్పన, లబ్ధిదారుల ఎంపిక, అమలు ప్రక్రియను అధికార యంత్రాంగం కసరత్తు చేయనుంది. కేసీ ఆర్‌ హుజూరాబాద్‌కు వచ్చే లోపు ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాల నే విషయంలో కూడా స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. అభ్యర్థి విషయంలో సీ ఎం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తె లుస్తోంది.

సామాజిక రాజకీయ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని, ఈటల ను ఎదుర్కొనే స్థాయి వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. దళితబంధు పథకానికి హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ వర్గం నుంచే అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top