Barrier With Bamboo National Highways Interested In New Experiment - Sakshi
Sakshi News home page

Regional Ring Road: వెదురుతో బారియర్‌.. సౌండ్‌పై వారియర్‌!.. సరికొత్త ప్రయోగంపై ఆసక్తి..

Published Fri, May 19 2023 8:03 AM

Barrier With Bamboo National Highways Interested In New Experiment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌ వేగా నిర్మించనున్న హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్డులో పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించే దిశగా జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కసరత్తు చేపట్టింది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాల ధ్వనిని నియంత్రించే నాయిస్‌ బారియర్లుగా.. వాహనాలు అదుపుతప్పితే పక్కకు దొర్లిపోకుండా ఆపే క్రాష్‌ బారియర్లుగా వెదురును వినియోగించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

వేగంగా దూసుకెళ్లే వాహనాల ధ్వని నుంచి.. 
ఎక్స్‌ప్రెస్‌ వేలలో వాహనాలు వేగంగా దూసుకుపోతుంటాయి. వాటి నుంచి విపరీతంగా ధ్వని వెలువడుతూ ఉంటుంది. దానికితోడు హారన్‌లు కూడా మోగిస్తుంటారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా హైవేలు ఉన్న ప్పుడు ఈ ధ్వనితో జనం ఇబ్బంది పడతారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు బెదిరిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా రోడ్డుకు ఇరువైపులా ధ్వనిని అడ్డుకునే నాయిస్‌ బారియర్లను ఏర్పాటు చేస్తుంటారు.

ధ్వనిని నియంత్రించే గుణమున్న పదార్థాలతో తయారైన మందంగా ఉన్న షీట్లను 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణానికీ మంచిదికాదు. దీనికి పరిష్కారంగా రోడ్లకు ఇరువైపులా కొన్ని రకాల గుబురు చెట్లను నాటి ధ్వనిని నియంత్రించే విధానం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. ఇలా ధ్వనిని నిరోధించే ప్రక్రియలో వెదురు బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ క్రమంలోనే రీజనల్‌ రింగురోడ్డుపై నిర్ధారిత ప్రాంతాల్లో రెండు వైపులా ఫర్గేసియా రూఫా, ఫర్గేసియా స్కోబ్రిడా, ఫర్గేసియా రొబస్టా జాతుల వెదురును పెంచాలని భావిస్తున్నారు. ఐదు మీటర్ల ఎత్తు, కనీసం ఐదారు మీటర్ల వెడల్పుతో ఈ చెట్లను పెంచితే.. మూడు మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే పటిష్ట క్రాష్‌ బారియర్‌తో సమానమని నిపుణులు చెప్తున్నారు. కొన్ని హైవేల పక్కన వీటిని ప్రయోగాత్మకంగా నాటేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఇటీవల ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే ఈ వెదురుకు వేగంగా, మరీ ఎత్తుగా పెరిగే లక్షణంతో ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్‌ వైర్లకు ఆటంకంగా మారొచ్చన్న సందేహాలు ఉన్నాయి. దీనిపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

క్రాష్‌ బారియర్లుగా కూడా.. 
రోడ్డుపై అదుపు తప్పే వాహనాలు దిగువకు దూసుకుపోకుండా, మరో లేన్‌లోకి వెళ్లకుండా క్రాష్‌ బారియర్లు అడ్డుకుంటాయి. సాధారణంగా రోడ్లకు రెండు వైపులా స్టీల్‌ క్రాష్‌ బారియర్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాటి స్థానంలో వెదురుతో చేసిన బారియర్ల ఏర్పాటుపై ప్రయోగాలు మొదలయ్యాయి. రీజనల్‌ రింగురోడ్డులో కూడా వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో పరిశీలన జరుగుతోంది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌–యావత్మాల్‌ జిల్లాలను జోడించే వణి–వరోరా హైవేలో ప్రపంచంలోనే తొలిసారిగా వెదురు క్రాష్‌ బారియర్లను 200 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. బాంబూసా బాల్కోవా జాతి వెదురు దుంగలను క్రమపద్ధతిలో కోసి వాటిని క్రియేసాట్‌ నూనెతో శుద్ధి చేసి.. రీసైకిల్డ్‌ హైడెన్సిటీ పాలీ ఇథలీన్‌ పూతపూసి ఈ బారియర్లను రూపొందించారు. ఇండోర్‌లోని నేషనల్‌ ఆటోమోటివ్‌ టెస్ట్‌ ట్రాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల అనంతరం వీటిని స్టీల్‌ క్రాష్‌ బారియర్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించొచ్చని తేల్చారు. రీజినల్‌ రింగురోడ్డులో వీటి ఏర్పాటుపై త్వరలో స్పష్టత రానుంది. 

వేగంగా భూసేకరణ..
రీజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తరభాగానికి సంబంధించి 158.6 కిలోమీటర్ల మేర భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరిహారం జారీ కోసం అవార్డ్‌ పాస్‌ చేయటంలో కీలకమైన 3డీ గెజిట్‌ నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి. సంగారెడ్డి–తూప్రాన్‌ మధ్య 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున రెండు ప్యాకేజీలకు మరో నెల రోజుల్లో టెండర్లు 
జారీ కానున్నాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. దీంతో రోడ్డు డిజైన్లను ఖరారు చేసే పనిని ఎన్‌హెచ్‌ఏఐ సమాంతరంగా ప్రారంభించింది. ఇందులోభాగంగా ప్రయోగాత్మకంగా వెదురును వినియోగించాలని భావిస్తోంది.
చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!

Advertisement
Advertisement