తమిళసినిమా: సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రాలు తమిళంలో అరుదుగానే వచ్చాయని చెప్పాలి. నిజానికి ఈ తరహా రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో కూడిన కథా చిత్రాలను చేయడం సాహసమే అవుతుంది. అలాంటిది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఈ తరహా చిత్రాలు విడుదల కావడం చర్చనీయాంశమే అవుతుంది. కరెక్ట్‌గా అలాంటి ఇతివృత్తంతో రూపొందిన తాజా చిత్రం టీఎన్–26. రంబిరామయ్య కథను అందించి, ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం ద్వారా ఆయన వారసుడు ఉమాపతి రామయ్య దర్శకుడిగా పరిచయమయ్యారు. నట్టి కథానాయకుడిగా నటించారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్ రవి నిర్మించిన ఈ చిత్రం టీజర్ విడుదల సమయంలోనే వివాదానికి దారి తీసింది. చిత్రంలో టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను కించపరచే విధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకుడు అధవ్ అర్జున ఆరోపణలు గుప్పించారు. దీంతో టీఎన్–26 చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఒక దశలో చిత్రం విడుదల అవుతుందా అనే చర్చ జరిగింది. ఎలాంటి సినీ నేపద్యం లేని ఒక యువకుడు నటుడిగా రంగప్రవేశం చేస్తాడు. అతను నటించిన ఒక చిత్రంలోని సంభాషణలు నటుడు ఎంజీఆర్ వీరాభిమాని అయిన వెయ్యి ఎకరాల ఆస్తిపరుడిని ఆకట్టుకుంటాయి. అతను ఎంజీఆర్ స్థాయిలో రాణిస్తారని నమ్మిన ఆ ధనవంతుడు ఆ నటుడిని ఆదరిస్తాడు. ఆయన అండతో అంచెలంచెలుగా ఎదిగిన ఆ నటుడు ఒక దశలో రాజకీయ రంగప్రవేశం చేస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలేమిటన్నది చిత్ర కథ. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం వివాదాస్పదాలను పక్కన పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


