సాక్షి, చైన్నె : చైన్నె జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈసారి భారీ సంఖ్యలో 419 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో, ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్ భారీగా అదనపు ఈవీఎంలనుచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీగా పెరిగిన ఈవీఎంల సంఖ్య
చైన్నె జిల్లాలో ఇప్పటికే 4,889 ఓటింగ్ యంత్రాలు ఉండగా, అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మరో 5,554 అదనపు యంత్రాలను కేటాయించారు. దీంతో మొత్తం ఈవీఎంల సంఖ్య 10,443కు చేరుకుంది. వీటిలో 20 శాతం యంత్రాలను అత్యవసర పరిస్థితి కోసం రిజర్వ్‌లో ఉంచారు.
నియోజకవర్గాల వారీగా ఏర్పాటు:
ఆర్కే నగర్, పెరంబూర్, కొలత్తూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మరో 12 నియోజకవర్గాల్లో రెండేసి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సైదాపేటలో మాత్రం 15 మంది అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఒకే యంత్రాన్ని వాడనున్నారు.
అభ్యర్థుల ఫొటోలతో బ్యాలెట్ పేపర్
ఈసారి ఓటర్లు ఎవరికి ఓటు వేస్తున్నారో సులభంగా గుర్తించేందుకు బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు వారి రంగు ఫొటోను కూడా ముద్రించనున్నారు. ఈ ఫోటోలను గుర్తులతో సరిపోల్చే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లా రిటర్నింగ్ అధికారి కుమార గురుబరన్ పర్యవేక్షణలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఎంపిక ప్రక్రియ శనివారంతో పూర్తయింది. వీటిని ప్రస్తుతం నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు.అత్యధికంగా పెరంబూర్ నియోజకవర్గంలో 1071 ఈవీ ఎంలు, కొలత్తూరు: 1029, ఆర్కే నగర్– 886, వేళచ్చేరి– 754, విరుగంబాక్కం– 746 ఉయోగిస్తున్నారు.ఇదిలా ఉండగా, చైన్నె సముద్ర తీరాలలో సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.


