నేడు టెట్ దరఖాస్తుకు చివరి రోజు
తిరువొత్తియూరు: టెట్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 18న ఉపాధ్యాయ నియామక మండలి వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్తులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ అధికారులు సూచించారు. టెట్ అర్హత పరీక్ష జూలై 4, 5 తేదీల్లో జరగనుంది.
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
తిరువళ్లూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన తొయుదవాక్కంలో జరిగింది తిరువళ్లూరు జిల్లా తొయుధవాక్కం గ్రామానికి చెందిన సుమతి(27). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన సతీష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరు మనస్పర్థల కారణంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి జెస్సీకా(02) అనే కుమార్తె ఉంది. సుమతి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోంది. దీంతో జెస్సీకా అమ్మమ్మ వద్ద వుంటుంది. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి జెస్సిక ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడిపోయింది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు నీటితొట్టెలో పడివున్న చిన్నారిని బయటకు తీసి ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి అవయవదానం
అన్నానగర్: ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంసభ్యులు దానం చేశారు. విల్లుపురం జిల్లాకు చెందిన సెల్వకుమార్ (23). ఇతను చైన్నెలోని కొడుంగైయూర్‌లో మెకానిక్. బైక్‌లో తన స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బుధవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అతని అవయవాలను దానం చేయడానికి కుటుంబంసభ్యులు అంగీకరించారు. బుధవారం సెల్వకుమార్ మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వేర్వేరుగా తీసుకుని, అవసరమైన వివిధ ఆస్పత్రులకు పంపించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
పిడుగుపడి యువకుడి మృతి
అన్నానగర్: పిడుగుపడి ఓ బాలుడు మృతిచెందాడు. కాంచీపురం తాలూకా, ఉవేరి చత్రం పంచాయతీ, పుతేరి గ్రామం, వినాయగర్ కోవిల్ వీధికి చెందిన గోపాలకష్ణన్. ఇతని కుమారుడు విశ్వనాథన్ కాంచీపురంలోని ఆండ్రసన్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో 12వ తరగతి పరీక్షలు రాశాడు. విశ్వనాథన్ బుధ వారం సాయంత్రం పొలంలో గడ్డిని సేక రించడానికి వెళ్లాడు. ఆసమయంలో ఆకా శం మేఘావృతమై వర్షం పడుతోంది. ఆసమయంలో పొలంలో గడ్డి సేకరిస్తున్న విశ్వనాథన్‌న్‌పై పిడుగు పడింది. ఈఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల ఉన్న వారు అతన్ని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు వారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.55 లక్షల మోసం
అన్నానగర్: రిటైర్డ్ సైనికుడి వద్ద రూ.55 లక్షలు మోసం చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అవడి సమీపంలోని నిరంజన్‌నగర్‌కు చెందిన లక్ష్మీనరసింహన్ (60) రిటైర్డ్ ఆర్మీ సైనికుడు. ఇతను, రాణిపేట జిల్లాలోని అరక్కోణం సమీపంలో ఉన్న ఓచలం ప్రాంతంలో కొబ్బరితోటతో కూడిన 76,800 చదరపు అడుగుల భూమి అమ్మకానికి ఉందని 2023లో ఒక ప్రకటన చూశాడు. తను ప్రకటనలోని సెల్ నంబర్‌కు ఫోన్ చేశాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి, తన పేరు భాస్కరన్ (52), తాను మాంగాడులోని అడిసన్‌నగర్‌కు చెందినవాడినని, కుమనన్‌చావడి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని నడుపుతున్నానని, చెప్పాడు. తర్వాత భాస్కర్‌కు రూ.55లక్షలు ఇచ్చాడు. భూమి దస్తావేజును లక్ష్మీనరసింహన్ పేరు మీద రిజిస్టర్ చేయకుండా అతడిని మోసం చేశాడు. భాస్కర్ నగదు ఇవ్వకపోవడంతో లక్ష్మీనరసింహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భాస్కర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చైన్నె సచివాలయంలో కలకలం
తిరువొత్తియూరు: చికిత్సలో నిర్లక్ష్యంగా కారణంగా తన కుమార్తెకు పాదం తొలగించడంతో మనస్తాపానికి గురైన తండ్రి చైన్నె సచివాలయంలో డీఎంకే పార్టీ జెండాకు నిప్పు పెట్టి ఆందోళన చేశాడు. వివరాలు.. చైన్నె ఆవడి పోలీసు క్వార్టర్స్‌కు చెందిన కోదండపాణి. చైన్నె ఓట్టేరి పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. 2021లో తన కూతురికి కిడ్నీ సమస్య రావడంతో ఎగ్మూర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్చారు. అప్పుడు డాక్టర్లు నిర్లక్ష్యంగా చికిత్స చేయడంతో బాలిక పాదం తొలగించారని ఆరోపిస్తూ నాలుగేళ్లుగా కోదండపాణి వివిధ చోట్ల ఆందోళన చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై ఓట్టేరి పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో తన కూతురికి న్యాయం కావాలని కోరుతూ కోదండపాణి యూనిఫాంలో సచివాలయానికి వెళ్లి డీఎంకే జెండాను కాల్చి నినాదాలు చేస్తూ నిరసన చేశారు. అక్కడున్న పోలీసులు జెండాను లాక్కున్నారు.


