సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఇది నిజంగానే ఒక ఆసక్తికరమైన, వినూత్నమైన ప్రచారం. సాధారణంగా దివంగతులైన నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఓట్లు అడగడం చూసి ఉంటాం. అయితే, జీవించి ఉన్న ఒక నాయకుడి (విజయ్) విగ్రహాన్ని ప్రచారానికి ఉపయోగించి ఓ అభ్యర్థి ఒక కొత్త ట్రెండ్‌కు తెరలేపాడు. తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా ఎన్‌ఎస్ విజ్జి పోటీ చేస్తున్నారు. అత్యంత బలమైన డీఎంకే అభ్యర్థి, మంత్రి అన్బిల్ మహేశ్‌ను విజ్జి ఢీకొడుతున్నాడు. అయితే విజయ్ ప్రత్యక్షంగా ప్రచారానికి అందుబాటులో లేకపోవడంతో వినూత్న వ్యూహం రచించాడు.
విగ్రహం రూపకల్పన
విజయ్ తన వెన్నంటి ప్రచారంలో ఉండే విధంగా విగ్రహం రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. ఐదున్నర అడుగుల ఎత్తుతో, విజయ్ రూపంలో ఉండేలా విగ్రహాన్ని తయారు చేయించాడు. తన ప్రచార వాహనంపై ఈ విగ్రహాన్ని ఉంచి నియోజకవర్గమంతా తిరుగుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దూరం నుంచి చూస్తే ప్రచారానికి విజయ్ వస్తున్నట్టుగా కనిపించే విధంగా విగ్రహాన్ని వ్యాన్‌లో స్టైలిష్‌గా నిలబెట్టిన విజీ ఓటర్లకు చేరువయ్యేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. సినీ క్రేజ్ ఉన్న విజయ్‌ను తన ప్రచారం కోసం లైవ్ లీడర్ పేరిట విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తొలిసారిగా రికార్డుల్లోకి ఈ అభ్యర్థి చేరడం విశేషం. సోషల్ మీడియాలో కూడా ఈ విగ్రహ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


