– తిరువయ్యారు అభ్యర్థికి ఉదయ నిధి ఆఫర్
సాక్షి, చైన్నె : తిరువయ్యారు అభ్యర్థి దురై చంద్రశేఖర్‌కు మంత్రి పదవిని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఆఫర్ చేశారు. ఆయన్ని భారీ ఆధిక్యంతో గెలిపిస్తే ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో తిరువయ్యారు ఓటర్లకు ఉదయనిధి సూచించారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రంలో దూసుకెళ్తున్నారు. తాజాగా డెల్టా జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరువయ్యారు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన హామీ ఇచ్చారు. తిరువయ్యారు డీఎంకే అభ్యర్థి దురై చంద్రశేఖరన్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటానని ఓటర్లకు వాగ్దానం చేశారు. 60 వేల ఓట్ల మెజార్టీ ఇస్తే.. మంత్రి పదవి ఖాయం అని తంజావూరు జిల్లాలోని తిరువయ్యారు నియోజకవర్గ అభ్యర్థి దురై చంద్రశేఖరన్‌కు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ ప్రచారం నిర్వహించారు.
సొంత నియోజకవర్గాన్ని కూడా మర్చిపోయా
ప్రచార జోరులో ఉన్న ఉదయనిధి తన వ్యక్తిగత పోటీ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కూడా చేపాక్కం– ట్రిప్లికేన్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయి ఉండటంతో తాను అభ్యర్థిని అన్న విషయాన్నే తరచుగా మర్చిపోతున్నానని వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రచారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని ఉదయ నిధి టార్గెట్ చేశారు. ఆయనకు తానంటే ఎనలేని ప్రేమ, ఇష్టం అని వ్యాఖ్యలు చేశారు. ఆయన లాగా కాళ్లు పట్టుకోవడం తనకు చేత కాదంటూ గతంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ కాళ్ల మీద పళణి స్వామి పడ్డ ఫొటోలను ప్రదర్శిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు.
సిక్సర్ కొట్టాలి
దురై చంద్రశేఖరన్ ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆరోసారి విజయం సాఽ దించి ‘సిక్సర్’ కొట్టాలని ఆకాంక్షించారు. అంతే కాదు ఆయనను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపి స్తే, మంత్రిని చేయాలని నాయకుడు (సీఎం స్టాలిన్)కి విజ్ఞప్తి చేస్తాను అని ప్రకటించారు. తంజావూరు జిల్లా డీఎంకేకు కంచుకోట అని, గత ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాలకు గాను 7 స్థానాల్లో డీఎంకే కూటమి గెలిచిందని గుర్తు చేశారు. దివంగత నేత కరుణానిధి ఈ జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రస్తుత సీఎం స్టాలిన్ కూడా తనను తాను ఎల్లప్పుడూ ‘డెల్టా బిడ్డ’గా చెప్పుకుంటారని పేర్కొంటూ, అదే ఇంటి బిడ్డంగా గర్వంగా తాను కూడా ఇక్కడికి వచ్చానని ఉదయనిధి పేర్కొన్నారు.


