సాక్షి, చైన్నె :కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికంగా కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం అభ్యర్థుల్లో 41 శాతం మంది కోటీశ్వరులు కాగా, అత్యధిక ఆస్తులు, అత్యధిక అప్పులు ఉన్న మొదటి ముగ్గురు అభ్యర్థులు ఎన్డీయే కూటమికి చెందిన వారే కావడం గమనార్హం.
30 అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు 8 రోజులే సమయం ఉంది. దీంతో ఇక్కడ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, ఈ కూటమిలోని బీజేపీ 10 చోట్ల, అన్నాడీఎంకే 2, లక్ష్య జననాయక కట్చి తరఫున రెండు స్థానాలలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా ఐక్యతతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఇండియా కూటమిలో కాంగ్రెస్ తరఫున 16, డీఎంకే తరఫున 13, వీసీకే ఒకరు పోటీలో ఉన్నారు. అయితే, ఈకూటమిలో ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలైన రెబల్స్ అభ్యర్థులు ఆరుగురు డీఎంకే అభ్యర్థులను ఢీకొడుతున్నారు. ఇక, ఇదే కూటమిలోని వీసీకే తరఫున మరో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులపై పోటీ ఉన్నారు. సీపీఎం, సీపీఐలు తలా ఓ దారిలో తమకు బలం ఉన్న స్థానాలలో పోటీలో ఉన్నాయి. ఇక, టీవీకే విజయ్ పార్టీ ఓ వైపు, సీమాన్ నామ్ తమిళర్ కట్చి మరో వైపు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు ఓట్ల వేటలో ఉన్నారు. మొత్తం 30 నియోజకవర్గాల్లో 294 మంది పోటీపడుతున్నారు.
కోటీశ్వరుల వివరాలు..
ఇక్కడ పోటీలో ఉన్న వారిలో అత్యధికంగా కోటీశ్వరులే ఉన్నారు. పుదుచ్చేరి ఎన్నికల కో–ఆర్డినేటర్ జోసెఫ్ విక్టర్‌రాజ్ విడుదల చేసిన నివేదిక మేరకు ఆస్తులు, ఇతర వివరాలు. ఇక్కడ ఎన్‌డీఏ కూటమిలోని లక్ష్య జననాగయ కట్చి అధ్యక్షుడైన అభ్యర్థి జోస్ చార్లెస్ మార్టిన్ ఆస్తులు రూ.609 కోట్లు. కోటీశ్వరులలో మొదటి స్థానంలో ఆయనే ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం రూ. 59 కోట్లు. ఇక, బీజేపీ అధ్యక్షుడు, అభ్యర్థి రామలింగం రూ.115 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి, హోంమంత్రి నమశ్శివాయం రూ.85 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అధికార ఎన్‌ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న 16 మందితో పాటు బీజేపీ అభ్యర్థులందరీ వంద శాతం కోటీశ్వరులే, ఈ అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.7.21 కోట్లుగా ఉండడం గమనార్హం.
అప్పులు...నేర చరిత్ర
అత్యధిక అప్పులు ఉన్న వారిలో కూడా జోస్ చార్లెస్ రూ.210 కోట్లు, రామలింగం రూ.30 కోటు, నమ శ్శివాయం రూ.20 కోట్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, 291 మంది అభ్యర్థులలో 66 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇద్దరిపై హత్య కేసులు, ముగ్గురిపై లైంగిక దాడి కేసులు ఉండడం పుదుచ్చేరి వాసులలో ఆందోళన తప్పడం లేదు.
విద్యార్హతలు:
134 మంది అభ్యర్థులు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారు. 125 మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వారు కాగా, నలుగురు నిరక్షరాస్యులు ఉన్నారు. అభ్యర్థుల్లో 41 నుంచి 60 ఏళ్లలోపు వారు 165 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 40 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.


