తాంబరం రాజాకు బుజ్జగింపు | - | Sakshi
Sakshi News home page

తాంబరం రాజాకు బుజ్జగింపు

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ సీట్ల కేటాయింపు వ్యవహారం కూటమి పార్టీల్లో చిచ్చుపెడుతోంది. తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహంతో ఎండీఎంకేకు చెందిన నేతలు కొందరు, డీఎంకే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించి, అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే, దక్షిణ చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి కళగ కుమార్‌కు ఈసారి కూడా పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 1994 నుంచి వైగో వెంటే నడుస్తున్నానని, పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని కుమార్‌ పేర్కొన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్‌ తన జిల్లా కార్యదర్శి పదవికి, ఇతర జిల్లా స్థాయి నిర్వాహకులతో కలసి సామూహిక రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నిమగ్నమయ్యారు.

తాంబరం రాజాకు బుజ్జగింపు

తాంబరం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌.రాజాకు కాదని, కొత్త ముఖమైన డాక్టర్‌ కృతికా దేవికి డీఎంకే టికెట్‌ కేటాయించడం కలకలం రేపింది. తమ నాయకుడికి టికెట్‌ దక్కలేదని ఎస్‌.ఆర్‌.రాజా మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఎంపీ ఏ.రాజా రంగంలోకి దిగి ఎస్‌.ఆర్‌.రాజాతో చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. అనంతరం కొత్త అభ్యర్థి కృతికాదేవి ఎస్‌.ఆర్‌. రాజాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఎస్‌.ఆర్‌ రాజాతో ఫోన్‌న్‌లో మాట్లాడి, తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలని కోరినట్లు సమాచారం. రాజా తగ్గినా, ఆయన మద్దతు దారులు తగ్గేలా లేదు. తాంబరం డీఎంకేలో అసమ్మతి సెగలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నాలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement