● మూడో సారిగా ప్రత్యర్థులుగా బరిలోకి
● ఒక్కచాన్స్ అంటున్న తమ్ముడు
సాక్షి, చరైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఎంజీఆర్, జయలలిత అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ దృష్ట్యా, ఎప్పడు ఆండిపట్టికి ప్రత్యేక గుర్తింపుతో పాటు ఇక్కడి రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన సమరం అన్నదమ్ముళ్ల మధ్య ఉంటున్నది. డీఎంకే తరఫున అన్న మహారాజన్, అన్నాడీఎంకే తరఫున తమ్ముడు లోగిరాజన్ ఇక్కడ ముచ్చటగా మూడోసారి తలబడేందుకు రెడీ అయ్యారు. 2019లో అన్నదమ్ములిద్దరూ అసెంబ్లీ ఉప ఎన్నికలలో ప్రత్యర్థులుగా తలబడ్డారు. ఇందులో అన్న మహారాజన్ విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో రెండోసారి కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. అదృష్టం అన్న మహారాజన్ వైపు నిలబడింది. తాజాగా మూడో సారిగా అన్నదమ్ముళ్లు ఢీకొడుతున్నారు.
తమ్ముడిలో గెలుపు ధీమా
తమ్ముడు లోగిరాజన్ 2021 ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేశారు. అన్న మహారాజన్‌కు ముచ్చెమటలు పట్టించే విధంగా ఓట్ల లెక్కింపులో దూసుకొచ్చారు. చివరకు 8,500 ఓట్ల స్వల్ప తేడాతో విజయావకాశాన్ని కోల్పోయారు. అయితే, గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి, తన ఓట్లకు గండి కొట్టిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఈసారి అన్నాడీఎంకే కూటమిలో ఉండడంతో తన విజయం ఖాయం అన్న ధీమా లోగిరాజన్‌లో నెలకొంది.
హ్యాట్రిక్ వైపు అన్న దృష్టి
గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని, ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని మహారాజన్ నమ్మకంతో ఉన్నారు. సీఎం స్టాలిన్ బలం, కూటమి మద్దతు తన విజయం సునాయసమేనని పేర్కొంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సొంత అన్నదమ్ములే ఒకరిపై మరొకరు తాజా ఎన్నికలలో విమర్శలు చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తుండడం ఆండి పట్టి వాసుల్ని ముక్కు మీద వేలు వేసుకునేలా చేసింది. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఆండిపట్టి నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది.


