సీనియర్లు చతికిలపడుతున్నారా?
తమిళసినిమా: అర్థమైనట్లు ఉంటూనే అవగతం కాని మాధ్యం సినిమా. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అవి ఆర్ట్ ఫిలిం అయినా, వాణిజ్య అంశాలతో కూడిన చిత్రాలయినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్‌స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ, కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే ప్రస్తుతం సీనియర్లు చతికిలపడుతున్నారా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ఇటీవల యువ కథానాయకులు,నవ దర్శకులు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభించడమే. సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్‌కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు.
సిమ్రాన్


