కంచిలో కమనీయోత్సవం
తరలి వచ్చిన భక్తులు
సాక్షి, చైన్నె: కాంచీపురంలో కనుల పండువగా 17 సంవత్సరాల తర్వాత ఏకాంబరనాథర్ ఆలయంలో మహోత్సవం సోమవారం జరిగింది. శాస్త్రోక్తంగా ఆలయ కుంభాభిషేకం ఘట్టం నిర్వహించారు. కాంచీపురం అంటే అందరికి గుర్తుకు వచ్చేది కామాక్షి అమ్మ వారు, పట్టు చీరలు. ఈ జిల్లా కేంద్రం పర్యాటకంగానే కాదు, ఆథ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే వరద రాజ పెరుమాల్ ఆలయం కూడా ఉంది. అలాగే, ఏకాబర నాథర్ ఆలయం కూడా ఉంది. ప్రసిద్ధి చెందిన ఏకాంబరనాథర్ ఆలయం పంచ భూత స్థలాలలో ఒకటిగా పూజించబడుతోంది. ఈ ఆలయంలో రూ. 29 కోట్ల తో జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. అన్ని పనులు ముగియడంతో కుంభాభిషేకంపై దృష్టి పెట్టారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఇక్కడ యాగాది పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
17 సంవత్సరాల తర్వాత
17 సంవత్సరాల తర్వాత ఏకాబరం నాథర్ ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేక పూజలకు పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు తరలి వచ్చారు. ముఖ్య ఘట్టం సోమవారం జరిగింది. కాంచీపురం జిల్లా ,తిరువళ్లూరు జిల్లాలతో పాటుగా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేకువ జామున తరలి రావడంతో పరిసరాలు ఆథ్యాత్మిక వాతావరణంలో మునిగింది. ఉదయం 5 గంటలకు యాగ శాల నుంచి పవిత్ర జలాలలను ఆలయ ప్రధాన ప్రాకారం ,మూల విరాట్ గోపురంలలో కుంభాభిషేకం అత్యంత వేడుకగా జరిగింది. కంచి శంకరాచార్య విజయేంద్ర సర్వతి, యువ పీఠాధిపతి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతితోపాటుగా 17 మంది స్వాములు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలోని స్వామి, అమ్మవార్లు, పరివార దేవతలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు జరిగాయి. కుంభాభిషేకం అనంతరం భక్తులపై పవిత్ర జలాలలను చల్లారు. అనంతరం భక్తులు ఆలయంలోని ఏకాంబరనాథర్ స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తిరుకళ్యాణం, పంచమూర్తుల వీధి ఊరేగింపు జరగనుంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వేల్ మోహన్ ఆధ్వర్యంలో సభ్యులు, ధర్మాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, కాంచీపురం ఎమ్మెల్యే ఎళిలగరసన్ తదితరులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కాంచీపురంకు ప్రత్యేక బస్సులు పలు ప్రాంతాల నుంచి నడిపారు. కాంచీపురంలో ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా ముందు జాగ్రత్తగా ఏకాంబరనాథర్ ఆలయం పరిసరా వైపుగా వాహనాలు అనుమతించకుండా దారి మళ్లించారు. జిల్లా కలెక్టర్ కళై సెల్వి మోహన్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు కావాల్సిన అన్న ప్రసాదాలను హిందూ దేవాదాయ శాఖ తరపున అందజేశారు.
కంచిలో కమనీయోత్సవం


