బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో శ్రీలంకు సమీపంలో శనివారం అల్పపీడనద్రోణి ఏర్పడింది. ఈప్రభావం సోమవారం నుంచి తీవ్రతరం కానుంది. చైన్నెతో పాటూ ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాలు పూర్తి స్థాయిలో ప్రభావాన్ని ఇంత వరకు చూపించ లేదు. వాస్తవానికి అక్టోబరు నుంచి ఇప్పటి వరకు సాధారణంగా పడాల్సి వర్షం కంటే 6 శాతం తక్కువగానే కురిసింది. చైన్నెలో అయితే, 23 శాతం తక్కువగా కురిసింది. మరింత సంవృద్ధిగా వర్షాలు పడాల్సి ఉంది. ఈ పరిస్థితులలో శ్రీలంకకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొనడంతో దీని ప్రభావం తమిళనాడుపై అధికంగా ఉంటుందని వాతావరణ పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ద్రోణి వాయువ్య దిశలో పయనిస్తుండటంతో ఇది తమిళనాడు తీరం వైపుగానే చొచ్చుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో తాజాగా కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాధపురం, విరుదునగర్ జిల్లాలపై మోస్తరుగా పడింది. సోమవారం నుంచి మరింతగా వర్షాలు పడనున్నాయి. 17వ తేదీ నుంచి చైన్నె, శివారు జిల్లాలో రెండురోజుల పాటూ భారీవర్షం పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆరు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలతో ఆ జిల్లాలకు మాత్రం సోమవారం ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. కాగా శ్రీలంకకు కూత వేటు దూరంలో ఉన్న రామనాథపురం జిల్లా రామేశ్వరంలో ఈదురు గాలుల ప్రభావం పెరిగింది. దీంతో జాలర్లు అప్రమత్తమయ్యారు. పడవలను జాగ్రత్త చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.


