ప్రొఫెసర్ల నియామకంలో అక్రమాలు
సాక్షి, చైన్నె: ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ల నియామకంలో అక్రమాలు వెలుగు చూశాయి. అన్నావర్సిటీ అధికారులతో సహా 17 మందిపై అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో 224 కళాశాలలకు చిక్కులు బయలుదేరాయి. వివరాలు.. రాష్ట్రంలో అన్నా వర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలు ఉన్న విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు ముందుగా ఆయా కళాశాలలో తమ వద్ద ఉన్న కోర్సులు, సౌకర్యాలు, అధ్యాపక సిబ్బంది సంఖ్య తదితర వివరాలతో పాటూ సమగ్ర సమాచారాలను అన్నావర్సిటీ ద్వారా ఏఐసీటీఈకి పంపించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2023–24 ఏడాది కూడా ప్రైవేటు కళాశాలల నుంచి వివరాలతో కూడిన నివేదిక అన్నావర్సిటీకి చేరింది. అదే సమయంలో అరప్పోర్ ఇయక్కం నకిలీ అధ్యాపకులు అంటూ ఆధారాలను బయట పెట్టడం చర్చకు దారి తీసింది. ఒక చోట పనిచేసే అధ్యాపకుడు మరో చోట కూడా పనిచేస్తూ వస్తున్నట్టుగా, నకిలీ ఆధార్ కార్డుల ను ఉపయోగించి అధ్యాపక సిబ్బంది పూర్తిస్థాయిలో తమ వద్ద పనిచేస్తున్నట్టుగా కళాశాలలు మాయాజాలం సృష్టించినట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది. విచారణలో అనర్హులు ఉన్నట్టు తేలింది. ప్రొఫెసర్ల వ్యవహారం అన్నీ అక్రమాలతో కూడుకున్నట్టు గుర్తించారు. 224 కళాశాలల్లో ఈ అక్రమాలు జరిగినట్టు తేలింది. ఈ పరిస్థితులలో అన్నాయూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ఇళయ పెరుమాళ్, అసిస్టెంట్ డైరెక్టర్ చిత్ర, మాజీ రిజిస్ట్రార్లు రవికుమార్, ప్రకాష్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు గిరిదేవ్, మార్షల్ ఆంథోని, ప్రశుదీశ్వరన్ , శైలేష్ సర్గుణం, మాలతి, స్వామి, కన్నన్, రవికుమార్‌తో పాటూ ఇంజినీరింగ్ కళాశాల నిర్వాహకులపై అవినీతి నిరోధకశాఖ పోలీసులు తాజాగా కేసులు నమోదు చేయడం చర్చకు దారి తీసింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి నిరోధక విభాగం నమోదు చేసిన ప్రాథమిక నివేదికలో ఉన్న సమాచారం మేరకు ప్రొఫెసర్ల నియామకం వ్యవహరంలో మాయాజాలం జరిగిందని, ఒకే సమయంలో అనేక కళాశాలలో అనేక మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్టు పరిగణించ బడినట్టు పేర్కొన్నారు.
అన్నావర్సిటీ
224 కళాశాలలకు చిక్కులు..
2023–2024లో తమిళనాడులోని 480 ఇంజినీరింగ్ కళాశాలల్లో 224 కళాశాలలకు చెందిన 224 మంది ప్రొఫెసర్లు ఈ మాయాజాలంలో కీలకంగా వ్యవహరించి ఉన్నారని, అన్నా వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలలో మోసం, లంచం, నమ్మక ద్రోహం, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు వెలుగుచూసినట్టు వివరించారు. అదే సమయంలో ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును కూడా ఆయా యాజమాన్యాలు అక్రమంగా పునరుద్ధరించుకున్నట్టు పేర్కొంటూ, ప్రాథమిక సమాచార నివేదిక ఆధారంగా 17 మందిపై కేసు నమోదు చేసినట్టు ప్రకటించారు.


