హరో.. హర | - | Sakshi
Sakshi News home page

హరో.. హర

Oct 28 2025 7:52 AM | Updated on Oct 28 2025 7:52 AM

హరో..

హరో.. హర

న్యూస్‌రీల్‌

ఆరుపడై వీడులలో మిన్నంటిన నామస్మరణ

అద్వితీయంగా సూరసంహార ఘట్టం

తిరుచెందూరు సాగర తీరంలో బ్రహ్మాండ వేడుక

లక్షల్లో తరలి వచ్చిన భక్త జన సందోహం

సూరుడిని సంహరించిన జయంతినాధర్‌

రాష్ట్రంలోని తమిళ్‌ కడవుల్‌ ఆరుపడై వీడులన్నీ హరోం ..హర నామస్మరణతో సోమవారం మిన్నంటింది. భక్తుల జయ జయ ధ్వానాలు, హరోహర..., కందా.., వేలా.. నామస్మరణ మధ్య మురుగన్‌ సన్నిధుల్లో సూర సంహార ఘట్టం కనుల పండువగా సాగింది. ఇందులో తిరుచెందూరు సాగర తీరంలో అద్వితీయ ఘట్టం లక్షలాది మంది భక్తుల నడుమ జరిగింది. జయంతి నాథర్‌ సూరుడిని సంహరించిన ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించారు.

సాక్షి, చైన్నె: తమిళ్‌ కడవుల్‌ మురుగన్‌కు ప్రసిద్ధి చెందిన ఆరుపడై వీడులు తమిళనాడులోనే ఉన్న విషయం తెలిసిందే. తిరుప్పర కుండ్రం ముత్తుకుమార స్వామిగా, పలముదిర్‌ చోళైలో మురుగన్‌గా, తిరుత్తణిలో బాలసుబ్రమణ్యన్‌గా, పళని దండయుధ పాణిగా, స్వామి మలైలో స్వామినాథన్‌, తిరుచెందూరులో జయంతి నాథర్‌గా కొలువై ఉన్న తమిళ్‌ కడవుల్‌కు స్కంధ షష్టి ఉత్సవాలు గత వారం రోజులుగా ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ ఉత్సవాలలో ఆరవ రోజైన సోమవారం ఆలయాలలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరిగాయి. సూర సంహార ఘట్టాల అద్వితీయంగా జరిగాయి. అలాగే ఈరోడ్‌ గోబి చెట్టి పాళయం పచ్చమలై మురుగన్‌ ఆలయంలో , తేని కంబం సురులి వేలు అప్పన్‌ ఆలయం, మేల్‌ మలయనూరు మురుగన్‌ ఆలయం, కంచి వెల్లకోట్టై మురుగన్‌ ఆలయం, వడపళణి సుబ్రమణ్య స్వామి ఆలయాలలో సైతం స్కంధ షష్టి ఉత్సవాలలో భాగంగా సూరుడ్ని స్వామి వారు సంహరించే ఘట్టాలు జరిగాయి. ఈ సమయంలో హరోం..హర నామస్మరణ మిన్నటింది.

తిరుచెందూరులో..

తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏటా స్కంధషష్టి అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొలి రోజున లక్షలాది మంది భక్తులు వత్రాన్ని ఆచరించి ఆలయ పరిసరాలలోని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆరు రోజుల పాటూ ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో పూజల్ని నిర్వహించిన భక్తులు సోమవారం తమ వ్రతాన్ని వీడారు. ఈ ఆరు రోజులు ఆలయంలో రోజూ విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. సర్వాలంకరణలతో సెంథిల్‌ ఆండవర్‌, జయంతి నాథర్‌గా పిలవబడే మురుగన్‌ స్వామి వారు వళ్లి, దేవయాని సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. స్కంధ షష్టి ఉత్సవాల్లో ఆరో రోజున అత్యంత ముఖ్య ఘట్టం సాగర తీరంలో అద్వితీయంగా జరిగింది. ఈ ఘటాన్ని తిలకించేందుకు ఆదివారం రాత్రి నుంచే నుంచే లక్షల్లో భక్తులు తిరుచెందూరుకు తరలి వచ్చారు. సముద్ర తీరం ఒడ్డున భక్తులు కూర్చుని ఈ ఘటాన్ని తిలకించే అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సముద్రంలోకి ఎవ్వరూ చొచ్చుకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పడవలు, బోట్ల నుంచి భద్రతను పర్యవేక్షించారు.

వేకువ జాము నుంచే..

వేకువ జామున ఒంటి గంటకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. అభిషేయాలు, యాగాది పూజలతో స్వామివారి విశ్వరూప దర్శనాన్ని భక్తులకు దక్కింది. ఆలయ సంతోష మండపంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు సాగినానంతరం సూర సంహార ఘట్టానికి ఏర్పాట్లు చేశారు. భక్త జనం కందా...వేలా, హరోం..హర అన్న నామ స్మరణను మిన్నంటేలా నినదించడంతో పట్టు వస్త్రాలు ధరించి, వేలా యుధంను చేతబట్టి స్వామి వారు సాగర తీరం వైపుగా కదిలారు. ఈ సూరసంహార ఘట్టానికి పురాణాలలో ఉన్న ప్రత్యేక కథను చాటే విధంగా వేడుక కనుల పండువగా సాగింది.

సూర

సంహార ఘట్టం

కనులపండువగా..

తారకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలను అరికట్టేందుకే సుబ్రహ్మణ్య స్వామి భూమి మీద అవతరించినట్టు పురాణాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు సుబ్రమణ్య స్వామిని తమిళ్‌ కడవుల్‌(తమిళ దేవుడు) అని భక్తులు పిలవడం జరుగుతోంది. పురాణ గాథను చాటే విధంగా జరిగిన అద్వితీయ ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్త జనంతో తిరుచెందూరు పులకించింది. ఆలయం, ఒడ్డు సముద్రంలోకి కలిసిందా..? అన్నట్టుగా పరిసరాలు మారాయి. ఇసుక వేస్తే రాలనంతంగా భక్తులు తరలి వచ్చి సూర సంహార ఘటాన్ని తిలకించారు. భక్త జన సమూహం మధ్యలోకి స్వామి వారు పచ్చ పట్టు, వజ్రాభరణాలను ధరించి రాగానే, శూరుడు(తారకాసురుడు) తన వీరంగాన్ని ప్రదర్శించే విధంగా క్షణాలలో వివిధ అవతరాలను మార్చుకుంటూ స్వామివారి సహనాన్ని పరీక్షించే రీతిలో ముందుకు సాగాడు. ఓపికగా సూరుడి వీరంగాలను వీక్షించిన స్వామివారు చివరకు తన వెండి వేలాయుధంతో సంహరించిన ఘట్టాన్ని చూసిన భక్తులు జయ జయ ధ్వానాలతో , హరో హర అంటూ, కందా...వేలా అన్న నినాదాల్ని మార్మోగించారు. సూర సంహార ఘట్టం అనంతరం భక్తులు సముద్ర స్నానం చేసిన ఆలయ సమీపంలోని నాలుగు బావి వద్దకు చేరుకుని ఆ నీటిని చల్లుకున్నారు. తదుపరి ఆలయంలో స్వామి వారి దర్శనానికి బారులుదీరారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ నాలుగు బావి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. మిగిలిన చోట్ల నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బావి నీటిని భక్తులు నెత్తిన చల్లుకుని ఆలయంలోకి వెళ్లడం ఆనవాయితీ. మలేషియా, సింగపూర్‌, శ్రీలంక వంటి దేశాలతో పాటూ తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు ఈ అద్వితీయ ఘటాన్ని ప్రత్యక్షంగా తిలకించినట్టు అంచనా. సూర సంహారం తదుపరి స్వామి వారికి అద్దాల భవనంలో విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. మంగళవారం అమ్మ వారి తపస్సు, స్వామి, అమ్మవార్ల వివాహ మహోత్సవం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. పోలీసులు నిఘాతో వ్యవహరించారు. రైల్వే, రవాణా సంస్థలు ప్రయాణీల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపాయి.

హరో.. హర1
1/4

హరో.. హర

హరో.. హర2
2/4

హరో.. హర

హరో.. హర3
3/4

హరో.. హర

హరో.. హర4
4/4

హరో.. హర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement