ఆదవ్‌కు.. ప్రమోషన్?
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగంలో ఆదవ్ అర్జునకు పదోన్నతి కల్పించేందుకు అధ్యక్షుడు విజయ్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న భుస్సీ ఆనంద్‌కు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించ బోతున్నట్టు సమాచారం. వివరాలు.. 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా సినీ నటుడు విజయ్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులే పార్టీలో అధికంగా ఉన్నారు. జిల్లాలోని ముఖ్య అభిమాన నేతలకు పదవులను అప్పగించారు. పార్టీ పరంగా 120 జిల్లాలను ఏర్పాటు చేసి, కార్యదర్శులు,ఇతర నిర్వాహకులను నియమించారు. అలాగే, సుమారు 20కు పైగా అనుబంధ సంఘాలను సైతం ఏర్పాటు చేసి పార్టీ పరంగా కార్యక్రమాలు విస్తృతం చేశారు. తాను సైతం అంటూ ప్రజలలోకి చొచ్చుకెళ్తున్న సమయంలో కరూర్ లో చోటు చేసుకున్న పెను విషాదం ప్రచార పర్యటనకు కాస్త బ్రేక్ వేసింది. దీంతో పార్టీ పరంగా కొన్ని కీలక మార్పునకు విజయ్ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలో కార్యదర్శులను మార్చడమే కాకుండా, రాష్ట్ర స్థాయి కమిటీలోనూ కొన్ని కీలక మార్పునకు నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆది నుంచి విజయ్ వెన్నంటి ఉంటూ వస్తున్న ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలకు పరిమితం చేయనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునకు అప్పగించే అవకాశాలు ఉన్నట్ట్టు చర్చ ఊపందుకుంది. అలాగే, పార్టీ రాష్ట్ర స్థాయిలో కీలక పదవులలో ఉన్న వారిని సైతం మార్చి, రాజకీయంగా వ్యాఖ్యల తూటాలను పేల్చగలిగే వారిని నియమించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.


