
19న తెరపైకి శక్తి తిరుమగన్
తమిళసినిమా: సంగీత దర్శకుడు, కథానాయకుడు, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు ఇలా పలు రంగాల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం శక్తి తిరుమగన్. నటి తృప్తి రవీంద్ర నాయకిగా నటించిన ఈ చిత్రానికి అరువి చిత్రం ఫేమ్ అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది విజయ్ ఆంటోని నటించిన 25 వ చిత్రం. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళంతో పాటూ తెలుగులోనూ భద్రకాళి పేరుతో ఈ నెల 19వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శక్తి తిరుమగన్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు విజయ్ ఆంటోని హీరోగా చిత్రాలు చేసిన దర్శకులు, చేయనున్న దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేదికపై విజయ్ ఆంటోని మాట్లాడుతూ తాను ఇప్పటివరకు 19 చిత్రాల్లో హీరోగానూ, కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ నటించానని చెప్పారు. ఒక విధంగా శక్తి తిరుమగన్ తాను నటించిన 25వ చిత్రం అని చెప్పారు. దర్శకుడు అరుణ్ ప్రభును తానే పిలిపించి కథ చెప్పమని అడిగానని, అయితే మొదట ఆయన చెప్పిన కథ అస్సలు అర్థం కాలేదు అని, అయితే ఆ తరువాత దర్శకుడు పూర్తిగా వివరించారని చెప్పారు. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని చెప్పారు. దీని తరువాత శశి దర్శకత్వంలో నూరుసామి చిత్రంలో నటించనున్నానని, ఆ చిత్రం కూడా బాగుంటుంది అని చెప్పారు. తనకు కథానాయకుడిగా నటించడం కంటే, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేయడమే ఇష్టం అన్నారు.
పలు చిత్రాలు నిర్మించి పలువురు ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించానని, అందుకోసం తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చనున్నట్లు చెప్పారు.