
మాతృత్వానికి వెనుకంజ
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మాతృత్వానికి యువతులు దూరం అవుతున్నారు. పిల్లలను కనకూడదన్న నిర్ణయంతో ఎక్కువ శాతం మంది ఉన్నట్టుగా పరిశీలనలో వెలుగు చూసింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది శిశు జననాలు గణనీయంగా తగ్గాయి. కేవలంలో 8 లక్షల మంది పిల్లలు జన్మించి ఉన్నారు. మాతృత్వం కోసం పరితపించే వారెందరో. తమ కంటూ ఓ బిడ్డ కోసం ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగే వారు మరెందరో. వివాహమైన జంటలకు చెందిన కుటుంబాలు అయితే, మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకోవాలన్న కాంక్షతో దేవుళ్లకు మొక్కేవారెందరో. ఇలాంటి తరుణంలో ఆధునిక యువత పిల్లలను కనేందుకు ముందుకు రావడం లేదన్నది తాజా నివేదికలో వెలుగు చూసి ఉంది. విద్యా వంతులు, వివిధ ప్రొఫెషన్స్‌లలో పనిచేస్తున్న యువతీ, యువకులు లివింగ్ టుగెదర్ అంటూ కాలం గడిపే పనిలో పడ్డారు. అలాగే, మరెన్నో జంటలు వివాహాలైన కొన్నాళ్లకే విడాకులు బాటలో పయనిస్తున్నాయన్నది స్పష్టమై ఉంది. ఇందుకు తగినట్టుగా గత ఏడాది శిశు జననాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. కుటుంబ నియంత్రణను ప్రభుత్వాలు ఇది వరకు విజయవంతంగా అమలు చేసినా, తాజాగా ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్‌తో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు పిల్లలను కనండీ అంటూ కొత్త జంటలకు వేదికలెక్కి విన్నవించే పనిలో పడ్డారు.
మనస్తత్వం మార్చుకోవాలి..
ఆధునిక యుగంలో కొత్త సంస్కృతి ఓ వైపు ఉంటే, మరో వైపు వివిధ సమస్యలు, ఆర్థిక పరమైన అంశాలతో పిల్లలను కనేందుకు జంటలు ఆలోచిస్తున్నట్టుగా సైతం తాజా పరిశీలనలో వెలుగు చూసింది. ఆధునిక తరంలో శిశు జననాలు తగ్గుతుండడం కలవరాన్ని రేపుతోంది. 2019 నుంచి ఈ తగ్గుముఖం సాగుతున్నట్టు ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. 2020లో తొమ్మిది లక్షల మంది పిల్లలు రాష్ట్రంలో జన్మించారు. 2022, 2023లో సంఖ్య అదే దరిదాపులలో ఉన్నా, 2024లో మరింతగా తగ్గి ఉండటం గమనార్హం. గత సంవత్సరం 8 లక్షల మంది పిల్లలే రాష్ట్రంలో జన్మించి ఉన్నారు. గతంతో పోల్చి తే లక్షల మంది పిల్లల జననాలు తగ్గాయి. అదే సమయంలో ప్రసవ సమయంలో మరణించే గర్భిణి తల్లుల సంఖ్య క్రమంగా తగ్గింది. 2019లో 58 మంది మరణించగా, తాజాగా ఈ సంఖ్య 35కు తగ్గింది. శిశు మరణాలు సైతం తగ్గి ఉన్నా, జననాల సంఖ్య గత ఏడాది లక్ష తగ్గడం గమనార్హం. ఈ విషయంగా ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటూ, పిల్లలను కనడం అనేది జంటల వ్యక్తిగతం అని, వారు తమ మనస్తత్వాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.