
ఎడపాడి కూటమికి.. ఆ దుస్థితి తప్పదు
వేలూరు: ఎడపాడి పళణి స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమిలోకి ఎవరూ చేరకపోవడంతో.. భవిష్యత్‌లో ఇతర పార్టీలను బతిమాలడం వారికి తప్పదని డీఎంకే పార్టీ సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేసి ప్రసంగించారు. కావేరి–గోదావరి అనుసందానం పథకం డీఎంకే అధికారంలోకి వచ్చినందుకే వాటిని వదిలి వేశారని మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పయణిస్వామి తెలుపుతున్నారని, అయితే ఈ పథకం గురించి ఎడపాడికి ఎటువంటి సమాచారం తెలియదన్నారు. సుప్రీంకోర్టులో కావేరి తీర్పు అనంతరం ఏమి జరిగిందనే విషయం ఎడపాడి తెలుసుకోవాలన్నారు. ఎటువంటి విషయం తెలియకుండానే ఊరూరు వెళ్లి ఏదేదో మాట్లాడాలనే విధంగా మాట్లాడుతున్నారన్నారు. అన్వర్‌రాజ అన్నాడీఎంకే పార్టీ నుంచి డీఎంకే పార్టీలోకి రావడంతో అన్నాడీఎంకే పార్టీ నాయకులకు భయం పట్టుకుందన్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి డీఎంకేకు వచ్చేందుకు వలసలు ప్రారంభమైందన్నారు. సీమాన్, విజయ్‌లకు ఎడపాడి ఆహ్యానం పంపుతున్నారన్నారు. దుకాణం తెరుచుకొని ఎవరూ రాకపోతే రండీ రండీ అని పిలిచే విధంగా ఎడపాడి దిగజారిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్, జోన్, చైర్మన్ పుష్పలత, తహసీల్దార్ జగదీశన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.