
సారీ కాదు.. న్యాయం కావాలి!
● లాకప్ డెత్‌లపై విజయ్ ● చైన్నెలో తొలిసారిగా నిరసన ● డీఎంకేపై వ్యాఖ్యల తూటాలు
సాక్షి, చైన్నె : సారీ కాదు...న్యాయం కావాలంటూ లాకప్ డెత్ మరణాలపై తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పబ్లి సిటీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం...నేడు సారీమా..! ప్రభుత్వంగా మారినట్టుందని విమర్శించారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుభువనంలో జరిగిన సెక్యూరిటీ గార్డు అజిత్‌కుమార్ లాకప్ డెత్‌తో పాటూ డీఎంకే హయాంలో వివిధ ప్రాంతాలలో చోటు చేసుకున్న 24 మరణాలకు న్యాయం కోరుతూ తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో చైన్నెలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఆపార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రపథమంగా చైన్నెలో నిరసనకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. లాలప్ డెత్ మరణాలకు సంబంధించిన బాధిత కుటుంబాలతో కలిసి వేదిక మీద నుంచి తన నిరసన తెలియజేశారు. సారీ వద్దు..న్యాయం కావాలని అన్న నినాదంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించారు. విజయ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు, కేడర్ నిరసనకు తరలి రావడంతో ఆ సరిసరాలు కిట కిటలాడాయి. తోపులాట సైతం జరగడంతో స్వల్పంగా పలువురు గాయపడ్డారు. నిరసనలో ఆ పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితర ముఖ్యులు ప్రసంగిస్తూ డీఎంకే, బీజేపీలపై శివాలెత్తారు.
సారీ మా సర్కారు..
విజయ్ మాట్లాడుతూ అజిత్ కుమార్‌లాకప్ డెత్ కేసును గుర్తు చేస్తూ, ఆ కుటుంబానికి ఒక్క సారీ చెబితే సరి పోతుందా..? అని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చారు...సారీచెప్పారు..అయితే, గత నాలుగేళ్లలో జరిగిన 24 లాకప్ డెత్ ఘటనలలో బాధిత కుటుంబాలకు సారీ చెప్పారా...? చెప్పకుండా ఉంటే చెప్పేయండి..! అని డిమాండ్ చేశారు. అలాగే నష్ట పరిహారంకూడా ఇచ్చేయండి సీఎం సార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం ప్రస్తుతం సారీ మా సర్కారుగా మారిందని విమర్శించారు. ఏదైనా ఘటన జరిగితే సారీ చెప్పడం అదే పనిగా పెట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు. తెలియకుండా జరిగిందీ.., జరగకూడదని జరిగిందీ...సారీ అంటూ ఒక్కమాటతో ఈపాలకులు ముగించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పాలనకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు.
మీరు చేసిందేమిటో..
గతంలో సాత్తాన్‌కులంలో తండ్రికుమారుడు జుడిషియల్ కస్టడీలో మరణిస్తే, కేసును సీబీఐకు అప్పగించడం తమిళనాడు పోలీసులకు అవమానం అని వ్యాఖ్యలు చేసిన వాళ్లు, ఇప్పుడు అజిత్‌కుమార్ విషయంలో చేసిందేమిటో? అని ప్రశ్నించారు. తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో న్యాయ పోరాటం ద్వారా ప్రత్యేక సిట్‌కు పట్టుబడుతున్న సమయంలో విచారణకు భయపడి ముందస్తుగానే సీబీఐ విచారణకు అప్పగించారని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కనుసన్నల్లో ఉన్న సీబీఐకు అప్పగించి కేంద్ర ప్రభుత్వం వెనుక దాక్కోవడం ఎందుకో.? అని సీఎంస్టాలిన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇంకా ఎన్ని ఘోరాలు, నేరాలు చూడాలంటూ, అన్నావర్సిటీ మొదలు అజిత్‌కుమార్ కేసు వరకు కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక తమరెందుకు సార్...తమరి ప్రభుత్వం ఎందుకు సార్. తమరికి సీఎం కుర్చీ ఎందుకు సార్..! అంటూ చమత్కారాలతో ప్రశ్నలను సీఎంను ఉద్దేశించి చేశారు. తాను ఎలా ప్రశ్నించినా తమరి వద్ద సమాధానం అన్నది ఉండదను సార్ అంటూ తమరికి తెలిసిందంతా సారీ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో చేసిన తప్పులకు ప్రాయచ్చిత్తంగా శాంతి భద్రతలను పునరుద్ధరించండి, బాధితులకు న్యాయం చేయండి అని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి తాము సరి చేయాల్సి ఉంటుందని, ఎలాంటి పోరాటాలకై నా వెనుకాడే పరిస్థితి లేదనిహెచ్చరించారు.

సారీ కాదు.. న్యాయం కావాలి!