
ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టులోని ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించే విధంగా రూ.1.75 కోట్లతో అదనపు భవన నిర్మాణ పనులను భూమిపూజతో ఎమ్మెల్యే చంద్రన్ శనివారం ప్రారంభించారు. పళ్లిపట్టు శివారులోని కోనేటంపేటలో పళ్లిపట్టు ప్రభుత్వాస్పత్రి వుంది. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిచే విధంగా ఆరోగ్యశాఖ నిధుల నుంచి రూ.1.75 కోట్లతో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి అదనపు భవనం నిర్మాణ పనులకు తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ భూమి పూజ చేశారు. ఇందులో ప్రజాపనుల శాఖ ఈఈ దేవన్, ఎస్‌టీఓ మురళి, మండల డీఎంకే కార్యదర్శి శ్రీనివాసన్, పట్టణ కార్యదర్శి సెంథిల్‌కుమార్, పట్టణ చైర్‌పర్సన్ మణిమేగళై, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో చికిత్స పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన మహిళలు ఆస్పత్రిలో అదనపు వైద్యులు నియమించి 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే చంద్రన్ ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి వైద్యులు, వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.