
సంకీర్ణంలో వాటా.. బాటలోనే అమిత్ షా
● వెనక్కి తగ్గని కేంద్ర మంత్రి ● సంపూర్ణ మెజారిటీతో అధికారం మాదే: పళణి ● బీజేపీ తమకు ప్రత్యర్థి అన్న విజయ్
సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే కూటమి ఏర్పడినప్పటి నుంచి అధికారంలోకి వస్తే సీఎం ఎవరో, సంకీర్ణ ప్రభుత్వమా..? అన్న చర్చ తమిళనాట విస్తృతంగా సాగుతూ వస్తోంది. ఇటీవల ఓ తమిళ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే అన్నాడీఎంకేలో దారి తీశాయి. సీఎం అభ్యర్థి ఎవరో అన్నది తేల్చక పోవడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం అన్న ఆయన వ్యాఖ్యలు అన్నాడీఎంకేను ఇరకాటంలో పడేశాయి.
అదే మాట..
కూటమి పాలన విషయంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. 2026 ఎన్నికలలో కూటమి గెలిస్తే అధికారంలో వాటాతథ్యమన్నారు. తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల విచ్ఛిన్నం, వారసత్వ రాజకీయం, తదితర అంశాలతో ప్రజలుమార్పును ఆశిస్తున్నారని, ఈసారి తమ కూటమి అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిలోని పీఎంకే,విజయ్ టీవీకేలతో పాటుగా చిన్న పార్టీలను ఒకే గొడుగు నీడన తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నామని ప్రకటించారు. అమిత్ షా వ్యాఖ్యలు మళ్లీ అన్నాడీఎంకేలో చర్చకు దారి తీయడంతో ఈ సారి వ్యూహాత్మకంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఎదురు దాడి వ్యాఖ్యలను పేల్చారు. శనివారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2026 అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీతో అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను గుర్తు చేయగా, తాను స్పష్టం చేశానుగా అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటుందంటూ పరోక్షంగా సంకీర్ణ పాలనకు అవకాశం లేదని పళణి తేల్చి చెప్పడం గమనార్హం. అదే సమంయలో కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ను ప్రశ్నించగా, అమిత్ షా వాక్కు వేద వాక్కు అని స్పష్టం చేశారు. ఆయన తమ అధినేతలు అని, వారి ఆదేశాలే కీలకం అని, వారు చెప్పిందే జరుగుతుందని, ఇదే తమకు వేద వాక్కు అని పేర్కొనడం గమనార్హం. ఇక, తమను పదే పదే కూటమిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని తమిళగ వెట్రి కళగం తీవ్రంగానే పరిగణించింది. తమ అధ్యక్షుడు విజయ్ తరపున పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి రాజ్ మోహన్ స్పందిస్తూ, పార్టీ ఆవిర్భావ సమయంలోనే స్పష్టం చెప్పామని, అలాగే, ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలోనూ స్పష్టతను మరింతగా వ్యక్తం చేశామన్నారు. తమ డీన్‌ఏలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం ఉంందన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ బీజేపీని ఎప్పుడో ఎంపిక చేశామని, ఎట్టి పరిస్థితులలోనూ వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

సంకీర్ణంలో వాటా.. బాటలోనే అమిత్ షా