
డీఎంకేలో వార్ రూం!
సాక్షి, చైన్నె: ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టే విధంగా డీఎంకే నేతృత్వంలో వార్ రూమ్(కంట్రోల్) ఏర్పాటైంది. అన్నా అరివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్ నుంచి సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర వ్యవహారాలను శనివారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పరిశీలించారు. వివరాలు.. 2026లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ప్రజల్ని ఏకం చేసే విధంగా 45 రోజుల ప్రచార పర్యటన, సభ్యత్వ నమోదుకు ఈనెల ఒకటో తేది నుంచి శర వేగంగా జరుగుతోంది. పది రోజులలో సుమారు 75 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇంటింటా ప్రభుత్వ పథకాలను విస్తృతం చేసే దిశగా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. మీ తో స్టాలిన్ నినాదంతో ఈనెల 15 నుంచి అధికారిక వేడుకగా ప్రభుత్వ సంబంధిత సేవలను త్వరితగతిన పొందేందుకు వీలుగా శిబిరాల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా నేతలతో స్టాలిన్ సమావేశం అవుతూ వస్తున్నారు. శనివారం దిండుగల్, వేడచందూరు, వేపన హల్లి నియోజకవర్గాల నేతలతో వన్ టూ వన్‌గా వేర్వేరుగా నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులను అధ్యయనం చేసి నేతలకు పలు సూచనలు ఇచ్చి పంపించారు. అలాగే, తరచూ డివిజన్ల వారీగా నియమించిన ఇన్‌చార్జ్‌లు, పార్టీ 78 జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యవహారాల గురించి చర్చించడం,నిర్ణయం తీసుకోవడంతో పాటుగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా తనకు వచ్చే వివరాలను పరిశీలించడం, సభ్యత్వ నమోదు తదితర ప్రక్రియల మీద దృష్టి పెడుతూ ప్రత్యేకంగా వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయించారు.
పరిశీలించిన స్టాలిన్
3 నియోజకవర్గ నేతలతో భేటీ
తిరుచ్చి శివాకు బాధ్యతలు
అన్నా అరివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్‌ను శనివారం స్టాలిన్ పరిశీలించారు. ఇక్కడి ఏర్పాట్లను గురించి మంత్రి టీఆర్‌బీ రాజ , సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతీ స్టాలిన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు వివరాల శాతం గురించి, ఇతర సమాచారాల గురించి నియోజకవర్గాల వారీగా స్టాలిన్ పరిశీలించారు. ముందుగా సీనియర్ నేత పొన్ముడిని తొలగించడంతో ఆయన స్థానంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పార్టీ కార్యాలయంలోని ఛాంబర్‌లో కేటాయించిన సీటులో స్టాలిన్ కూర్చోబెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇలంగోవన్, పూచ్చి మురుగన్ వంటి నేతలు ఈసందర్భంగా శివకు శుభాకాంక్షలు తెలియజేశారు.

డీఎంకేలో వార్ రూం!

డీఎంకేలో వార్ రూం!