
నిఘా నీడలో గ్రూప్– 4 పరీక్ష
● 3,935 పోస్టులకు 13.89 లక్షల మంది హాజరు ● పలుచోట్ల అభ్యర్థుల ఆగ్రహం
సాక్షి, చైన్నె: వీఏఓ, జూనియర్ అసిస్టెంట్‌తో సహా పలు పోస్టుల భర్తీ నిమిత్తం శనివారం నిఘా నీడలో గ్రూప్ 4 పరీక్షల జరిగింది. 3,935 పోస్టులకు గాను 13.89 లక్షల మంది పరీక్షకు హజరయ్యారు. అనేక చోట్ల కాస్త ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించక పోవడంతో అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వివాదం తప్పలేద. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 4 పోస్టుల్లో 3,935 ఖాళీల భర్తీకి ఇటీవల 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో గ్రామ పరిపాలనా అధికారి వీఏఓ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 1,621, జూనియర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ 239, టైపిస్ట్ 1,099, షార్ట్‌హ్యాండ్ టైపిస్ట్ (గ్రేడ్ 3) 368, అసిస్టెంట్ కన్సర్వేటర్ 519, తదితర పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణతను విద్యార్హతగా నిర్ణయించినా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13 లక్షల 89 వేల 738 మందిని పరీక్షకు అర్హులుగా ఎంపిక చేశారు. వీరిలో 5,26,553 మంది పురుషులు,8,63,688 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 354 ప్రాంతాలలో 4,922 పరీక్ష వేదికలను ఎంపిక చేశారు. 20 మంది అభ్యర్థికి ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. అన్ని వ్యవహారాలను వీడియో రికార్డు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు.
కట్టుదిట్టంగా ఆంక్షలు..
ఆదివారం రాత పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగింది. ఈ పరీక్ష నిమిత్తం ఆయా సెంటర్ల వద్దకు ఉదయాన్నే ఏడు గంటలకే అభ్యర్థులు చేరుకున్నారు. 8.30 గంటల నుంచి క్షుణ్ణంగా తనీఖల అనంతరం అనుమతించారు. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రతనడుమ లోనికి పంపించారు. కాపీయింగ్‌కు ఆస్కారం ఇవ్వకుండా పరీక్షల ప్రక్రియ నిఘా నీడలో జరిగింది. కొన్ని నిమిషాల పాటుగా ఆలస్యంగా వచ్చిన ఏ ఒక్కర్నీ లోనికి అనుమతించ లేదు. అనేక సెంటర్లలో నలుగురైదుగురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎవర్నీ లోనికి అనమతించ లేదు. దీంతో తీవ్ర నిరాశతో కొందరు హాల్ టికెట్లను అక్కడే చించి పడేసి వెళ్లి పోయారు.మరి కొందరు కాళ్లా లేవలా పడ్డా అధికారులు అంగీకరించ లేదు. తమకు కేటాయించిన సమయం వరకు అనుమతించామని, తాము ఏమి చేయలేమంటూ కొందరు అధికారులు అభ్యర్థులను బుజ్జగించి వెనక్కి పంపించేశారు. చైన్నెలో అయితే, 310 సెంటర్లలో పరీక్ష జరిగింది. ఈ పరీక్షలను పలు సెంటర్లలో టీఎన్‌పీఎస్సీ చైర్మన్ ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫలితాలను మూడు నెలల్లో వెల్లడిస్తామన్నారు. 13.89 లక్షల మంది పరీక్షలకు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నామన్నారు.