
మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి హత్య
● నిందితులను అరెస్టు
చేయాలని రాస్తారోకో
తిరువళ్లూరు: ఇంటికి సమీపంలో మద్యం తాగుతూ వీరంగం చేస్తున్న యువకులను వారించిన వ్యక్తిని మద్యం మత్తులో వున్న యువకులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా ఈకాడు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఈకాడు కండ్రిగ ప్రాంతానికి చెందిన కార్తికేయన్(42). ఇతను చైన్నెలోని ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. ఇతని భార్య సంధ్య(34). వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఈకాడు కండ్రిగలోని ఇంటికి తిరువళ్లూరు నుంచి బయలుదేరాడు. ఇంటికి సమీపం వస్తుండగా ఆ సమయంలో అక్కడ మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో కార్తికేయన్ వారిని మందలించాడు. మద్యం మత్తులో వున్న యువకులు కార్తికేయన్‌పై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు డీఎస్పీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. నిందితులను శిక్షిస్తామన్న డీఎస్పీ హామీ మేరకు రాస్తారోకో విరమించారు.

మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి హత్య