
సూర్య విజయ్‌సేతుపతికి మంచి భవిష్యత్తు
తమిళసినిమా: ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడుగా అవతారం ఎత్తి తెరకెక్కించిన చిత్రం ఫినిక్స్. ఆయన భార్య రాజ్యలక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా విజయ్‌సేతుపతి వారసుడు సూర్య విజయ్‌సేతుపతి కథానాయకుడిగా పరిచయమయ్యారు. శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని వేల్‌రాజ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈనెల 4వ తేదీన విడుదలై ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శుక్రవారం థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. సూర్య విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఫినిక్స్ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు. చిత్రం చూసిన తర్వాత చాలామంది అభినందించారని, మాస్టర్ అనల్‌అరసు తనను హీరోగా ఎంపిక చేసి ఉండకపోతే తాను ఈ వేదికపై ఉండేవాడిని కాదని అన్నారు. నిర్మాత తనకు పూర్తిగా మద్దతుగా నిలిచారన్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తనకు సహకరించారని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తాను దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకు భార్య రాజ్యలక్ష్మి మద్దతుగా నిలిచినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఫినిక్స్ చిత్రానికి చాయాగ్రాహకుడు వేల్ రాజ్, సంగీత దర్శకుడు శ్యామత సీఎస్ మూలస్తంభాలు అని పేర్కొన్నారు. ఎడిటర్ రూబెన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని తెలిపారు. ఈ చిత్ర విజయం తనతో పాటు ఇందులో పనిచేసిన అందరికీ చెందుతుందన్నారు. సూర్య విజయ్‌సేతుపతికి మంచి భవిష్యత్తు ఉందని దర్శకుడు అనల్ అరసు అన్నారు.
ఫినిక్స్ చిత్ర యూనిట్

సూర్య విజయ్‌సేతుపతికి మంచి భవిష్యత్తు