
శరవేగంగా పుష్కరిణి పనులు
తిరుత్తణి: ఆడికృత్తిక తెప్పోత్సవం సందర్భంగా శరవణ పుష్కరిణి సిద్ధం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వచ్చే నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు ఆడికృత్తిక తెప్పోత్సవం నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు కావళ్లతో తిరుత్తణి ఆలయం చేరుకుని స్వామికి మొక్కులు చెల్లించనున్నారు. ఆగస్టు 16న ఆడికృత్తికతో పాటు తొలిరోజు తెప్పోత్సవం సందర్భంగా శరవణ పొయ్‌గై పుష్కరిణి శుభ్రం చేసేందుకు వీలుగా ఉభయదారుల నిధుల సాయంతో రూ.23.50 లక్షలతో కోనేటి నుంచి నీటిని తొలగించి పూడిక పనులు రెండు నెలలుగా నిర్వహించారు. ప్రస్తుతం కోనేటిలో కలుషిత నీటిని తొలగించి పూడికతీసి పరిశుభ్రం చేశారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేరులో నింపుతున్నారు. మరో వారంలో కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.