
ఇక, అన్బుమణి మాత్రమే!
● నా పేరు వాడొద్దు ● రాందాసు స్పష్టీకరణ
సాక్షి, చైన్నె : తండ్రి తనయుడి మధ్య వార్‌లో మరో ట్విస్టు గురువారం చోటు చేసుకుంది. ఇక మీదట అన్బుమణి అని మాత్రమే వాడండీ. ఆయన పేరు వెనుక తన పేరును ఉపయోగించ వద్దు అని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు వారసుడు అన్బుమణి అన్న విషయం తెలిసిందే. ఆది నుంచి ఆయన్ని అందరూ అన్బుమణి రాందాసు అని పిలవడం, పేరును రాయడం జరుగుతూ వస్తోంది. తాజాగా తండ్రి, తనయుడి మధ్య వివాదం తారస్థాయికి చేరిన నేపథ్యంలో రాందాసు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కుంబకోణంలో తంజావూరు, తిరువారూర్ జిల్లాలో వన్నియర్ సంఘాల నేతలు, పార్టీ వర్గాలతో రాందాసు సమావేశమయ్యారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి చర్యలను ఎండగట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి తన పేరును ఇనీషియల్‌గా వాడుకోవచ్చు అని పేర్కొంటూ, అయితే, ఆయన పేరు వెనుక అన్బుమణి రాందాసు అని మాత్రం వాడ వద్దు అని సూచించారు. ఇక మీదట అన్బుమణి అని మాత్రమే వాడాలని పేర్కొంటూ, ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌కు బుధవారం రాందాసు లేఖ రాసిన నేపథ్యంలో గురువారం అన్బుమణి సైతం మరో లేఖ రాశారు. రాందాసు నేతృత్వంలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ తీర్మానాలను ఆమోదించ వద్దని కోరారు. ఈ సమావేశానికి చైర్మన్, ప్రధాన కార్యదర్శి హాజరు కాలేదని, ఈ దృష్ట్యా, ఆ సమావేశ తీర్మానాలకు ఎలాంటి మద్దతు లేదని,వాటిని తిరస్కరించాలని ఎన్నికల కమిషన్‌ను అన్బుమని కోరారు.