
తిరుత్తణిలో అసెంబ్లీ మూల్యాంకన కమిటీ తనిఖీ
తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లాలో అసెంబ్లీ మూల్యాంకన కమిటీ సభ్యులు మంగళవారం పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తొలుత తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మాస్టర్‌ప్లాన్ పథకం ద్వారా రూ.87 కోట్లు వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కమిటీ చైర్మన్ గాంధీరాజన్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు 10 మంది తనిఖీలు చేశారు. అన్నదాన కేంద్రంలో స్టాక్ గదిలో ఉంచిన బియ్యం, పప్పు సహా ఆహార వస్తువులు నిల్వ, నాణ్యతను పరిశీలించారు. అన్నదాన కేంద్రం విస్తరణకు సంబంధించి చేపట్టిన పనులు తనిఖీ చేశారు. అలాగే రాజగోపురం నుంచి మాడవీధికి లింగ్ మెట్లు నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం ఆలయ కల్యాణ మండపాల నిర్మాణ పనులు, ఆలయ సిబ్బందికి శిక్షణకు నిర్మిస్తున్న కేంద్రాలు పరిశీలించారు. తిరువలంగాడు సమీపంలోని మనవూరు వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో వరి సాగు పద్ధతులను పరిశీలించారు.