
అజిత్ కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
● హైకోర్టు ఽమధురై ధర్మాసనానికి నేడు నివేదిక ఇవ్వనున్న దర్యాప్తు అధికారి
అన్నానగర్: శివగంగ జిల్లాలో ఆలయ కాపలాదారుగా పనిచేస్తున్న అజిత్ కుమార్, ఆభరణాలు పోయాయనే ఫిర్యాదుపై విచారణకు తీసుకెళ్లిన తర్వాత మరణించాడు. అతన్ని దారుణంగా కొట్టి అరెస్టు చేసిన ఐదుగురు పోలీసులపై హత్య కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు మధురై హైకోర్టులో విచారణకు వచ్చింది. అజిత్ కుమార్ మృతిపై విచారణ జరిపి 8వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈమేరకు హైకోర్టు అదనపు జిల్లా న్యాయమూర్తి జాన్ సుందర్ లాల్ సురేష్‌ను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆ తర్వాత, ఆయన తిరుప్పువనంలోని హైవేస్ డిపార్ట్‌మెంట్ యాజమాన్యంలోని హాస్టల్‌లో బస చేసి 4 రోజులు దర్యాప్తు నిర్వహించారు.
మాధపురం ఆలయ పూజారి ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్. ఆటో డ్రైవర్ అరుణ కుమార్, ఆలయ సీసీటీవీ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాసన్, ఛారిటీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ పెరియసామి, పోలీసులు అజిత్ కుమార్ పై దాడి చేయడాన్ని వీడియో తీసిన శక్తిశ్వరన్ సహా చాలా మందిని విచారించి, వారి ద్వారా వాగ్మూలం వీడియోను రికార్డు చేశారు. అజిత్ కుమార్ తల్లి మాలతి, సోదరుడు నవీన్ కుమార్, సోదరి రమ్య శరవణకుమార్ , అఖీ పి. సుకుమారన్, తిరుప్పువనం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ సహా అనేక మందిని కూడా విడివిడిగా విచారించారు. ఆటో డ్రైవర్ అయ్యనార్, తిరుభువనమ్ గవర్నమెంట్ మెడికల్ వైద్యుడు కార్తికేయన్, అజిత్ కుమార్ మతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన మధురై రాజాజీ ఆసుపత్రి వైద్యులు సదాశివం, ఏంజెల్ కూడా న్యాయమూర్తికి వాంగ్మూలాలు ఇచ్చారు. తరువాత, తిరుప్పు వనం పోలీస్ స్టేషన్‌లోని పోలీసులను కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. అజిత్ కుమార్ హత్య కేసులో అరెస్టు చేయబడి మధురై సెంట్రల్ జైలులో ఉన్న ఐదుగురు పోలీసు అధికారులను విచారించడానికి న్యాయమూర్తి జాన్ సుందర్ లాల్ అనుమతి పొందినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లి విచారణ చేపడతారని తెలుస్తుంది. కాగా న్యాయమూర్తి దర్యాప్తు నివేదికలో అనేక కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.