
బానిస కావడం సమాజానికి హానికరం
● ఏఓఎఫ్‌ఎస్ నూతన ఉపాధ్యక్షులు
డాక్టర్ కామరాజ్
కొరుక్కుపేట: ఇంటర్నెట్ అయినా, మాదకద్రవ్యాలైనా దేనికై నా బానిస కావటం సమాజానికి హానికరం అని,దీని నుంచి ప్రజలను రక్షించడానికి వైద్యులు కలసి పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆసియా–ఓషియానియా ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజిస్ట్ (ఏవోఎఫ్‌ఎస్)నూతన ఉపాధ్యక్షులు డాక్టర్ టి. కామరాజ్ అన్నారు. బుధవారం చైన్నెలో జరిగిన విలేకర్ల సామవేశంలో ఆయన మాట్లాడుతూ ఏవోఎఫ్‌ఎస్‌కు కొత్త ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావటం తన చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన లైంగిక విద్య పాఠ్యాంశాలను అమలు చేయాలని సెక్సాలజిస్టులు కోరుతున్నట్టు తెలిపారు.సాంప్రదాయకంగా ఆహారం, దుస్తులు, నివాసం మానవుల ప్రాథమిక అవసరాలు ఉంటాయి అని అలాగే లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రాథమిక అవసరంగా చేర్చాలని అన్నారు. లైంగిక ఆరోగ్యం అందరికీ ముఖ్యం అని అదే సమయంలో లైంగిక హింస, దుర్వినియోగాన్ని నివారించడం కూడా అంతే ముఖ్యం అని తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు ప్రతీ చోటా ఉపయోగించబడుతున్నాయని భారతదేశంలో 700 మిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం పాఠశాలలు, కళాశాలల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ పాతుకుపోయిందన్నారు. ఇంటర్నెట్ అయినా, మాదక ద్రవ్యాలైనా బానిస కావటం సమాజానికి హానికరం అని పేర్కొన్నారు. ఏవోఎఫ్‌ఎస్ లైంగిక ఆరోగ్యం, లైంగిక న్యాయాన్ని మానవశ్రేయస్సు, ప్రాథమిక హక్కులలో భాగాలుగా గుర్తించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తుందని తెలిపారు. డాక్టర్ కేఎస్ జయరాణికామరాజ్ కూడా పాల్గొని ప్రసంగించారు.