సాగుకు నీరు! | - | Sakshi
Sakshi News home page

సాగుకు నీరు!

Jun 13 2025 5:31 AM | Updated on Jun 13 2025 5:31 AM

సాగుక

సాగుకు నీరు!

● మేట్టూరు నుంచి విడుదల ● డెల్టా వైపు పరవళ్లు ● కావేరికి సీఎం స్టాలిన్‌ పుష్పనీరాజనం

సేలం: సాగు నిమిత్తం అన్నదాతల కోసం డెల్టా వరప్రదాయిని మేట్టూరు జలాశయం నుంచి గురువారం నీటిని విడుదల చేశారు. కావేరి నదిలో నీటి పరవళ్లు డెల్టా జిల్లాల వైపు సాగింది. ఈ సందర్భంగా కావేరి నదిలో సీఎం స్టాలిన్‌, మంత్రులు, అధికారులు పూలు చల్లి నీరాజనాలు పలుకుతూ ఆహ్వానించారు. కురువై సాగు నిమిత్తం డెల్టా రైతుల కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

సేలంలో మేట్టూరు జలాశయం డెల్టా జిల్లాల రైతాంగానికి వరప్రదాయినిగా పేరు గడించిన విషయం తెలిసిందే. కావేరి నీటి ఆధారంగా ఉన్న ఈ జలాశయం చరిత్రలో 20వసారిగా నిర్ణీత జూన్‌ 12న సాగు నిమిత్తం తాజాగా నీరు విడుదలైంది. ఉదయం జరిగిన కార్యక్రమంలో మేట్టూరు జలాశయం నుంచి కురువై సాగు నిమిత్తం నీటిని సీఎం స్టాలిన్‌ విడుదల చేశారు. స్టాలిన్‌తోపాటు మంత్రులు దురైమురుగన్‌, ఎంఆర్‌కే పన్నీరుసెల్వం, అన్బిల్‌ మహేశ్‌, రాజేంద్రన్‌, శివశంకర్‌ పూలు చల్లి కావేరి తల్లికి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 114 అడుగులుగా ఉంది. 5.22 లక్షల ఎకరాల్లో కురువై సాగు నిమిత్తం నీటిని విడుదల చేశారు. నామక్కల్‌, కరూర్‌, తిరుచ్చి, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం, మైలాడుతుకరై ,కడలూరు జిల్లాల్లో 4,91,200 ఎకరాలు, అరియలూరులో 30,800 ఎకరాలకు నీటిని అందించే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే, సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు 12.10 లక్షల ఎకరాల్లో సంబా, తాలడి పంటల సాగుకు నీరు విడుదల చేస్తారు. నైరుతి ఆశాజనకంగా ఉన్న దృష్ట్యా, కురువైకు సమృద్ధిగా నీళ్లు దక్కే అవకాశాలు ఎక్కువే. ఆతర్వాత ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో సంబా, తాలడి పంటలకు నీళ్లు దక్కుతాయి. ముందుగా సేలం పర్యటనకు వచ్చిన సీఎం స్టాలిన్‌కు దారి పొడవునా జన సందోహం నీరజనాలు పలుకుతూ ఆహ్వానించారు. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం మేట్టూరు జలాశయం నుంచి నిర్ణీత సమయంలోనే నీటిని విడుదల చేశారు.

ఓర్వలేక విమర్శలు

కొంత మంది ప్రగతిని చూసి ఓర్వలేక , విమర్శలు గుప్పిస్తున్నారని, ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మదురైలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ప్రధాని పేరిట అమల్లో ఉన్న పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేరుతో అమలయ్యే ప్రాజెక్టులకు నిధులు కూడా తామే అందించాల్సిన పరిస్థితి ఉందని, తమకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, సరైన ప్రాజెక్టులను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా తాను అమిత్‌షాను ప్రశ్నిస్తున్నట్టు పేర్కొంటూ, పదేళ్ల క్రితం మదురైలో పునాదులు వేసిన ఎయిమ్స్‌ పరిస్థితి గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో మదురైని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామన్న విషయం ప్రజలకు తెలుసని అన్నారు. కీలడి పరిశోధన నివేదికను బయట పెట్టే ధైర్యం లేక కుంటి సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తమిళులు ఆత్మగౌరవం ఉన్నవారు అనేది కేంద్రం తెలుసుకోవాలని హితవు పలికారు.

న్యూస్‌రీల్‌

జీవనాడి కావేరి

ఈసందర్భంగా జరిగిన సభలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ డెల్టా జిల్లాలు తమిళనాడుకు ధాన్యాగారం అని వ్యాఖ్యలు చేశారు. దీనికి జీవనాడిగా కావేరి జలాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, 16 జిల్లాలను సుసంపన్నం చేయగల మేట్టూరు రిజర్వాయర్‌ నుంచి నీటిని నిర్ణీత సమయంలో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు వరి క్వింటాలుకు రూ. 2,500గా నిర్ణయించామని ప్రకటించారు. సన్నరకానికి రూ. 2,545గా ధర నిర్ణయించామని వివరిస్తూ ఒక మిలియన్‌ కంటే ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నామన్నారు.

అభివృద్ధి పనులు...

సేలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రూ.880 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌, రూ.100 కోట్ల అంచనా వ్యయంతో కొత్త లైబ్రరీ భవనం సహా కేవలం రూ.1,244 కోట్లతో చేపట్టనున్న 509 కొత్త పనులకు సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.200 కోట్ల 26 లక్షల వ్యయంతో పూర్తి చేసిన 225 పనులను ప్రారంభించారు. రూ.204 కోట్ల 64 లక్షల విలువైన సంక్షేమ పథకాలను 1,01,203 మంది లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆరు హామీలు

అభివృద్ధి క్రమంలో సేలం జిల్లాకు మరో ఆరు కొత్త ప్రకటనలు చేస్తున్నట్టు ప్రకటించారు. సేలం కార్పొరేషన్‌ ప్రాంతాల్లో రూ. 100 కోట్లతో రోడ్లను మెరుగు పరచడం, మురుగు నీటి కాలువలు, చిన్న చిన్న వంతెనలను నిర్మించనున్నామన్నారు. సెవ్వాపేటలో మార్కెట్‌ను అప్‌ గ్రేడ్‌ చేయనున్నామన్నారు. తలైవాసల్‌ సర్కిల్‌లోని రైతులకు ఇలుప్పా నత్తం గ్రామంలో అన్నదాతల ఉత్పత్తుల అమ్మకాల కేంద్రాన్ని ఆధునీకరించనున్నామన్నారు. తాను చైన్నెలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా జరిగే అన్ని రకాల పనులు, ఘటనలు, ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నట్టు, ప్రణాళికలను రూపొందించి అమలు చేయిస్తున్నట్టు వివరించారు.

సాగుకు నీరు!1
1/2

సాగుకు నీరు!

సాగుకు నీరు!2
2/2

సాగుకు నీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement