వేణుగోపాలుని హుండీ లెక్కింపు
కార్వేటినగరం: మేజర్ పంచాయతీ కార్వేటినగరంలో వెలసి ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1 లక్ష 32 వేల 386 రూపాయలు వచ్చినట్లు టీటీడీ ఆలయ అధికారి సురేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆలయ ఆవరణలో పరకామణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించామన్నారు. వచ్చిన ఆదాయాన్ని టీటీడీ ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. అలాగే మండల పరిదిలోని ఆలత్తూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీవరద వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా శనివారం హుండీ లెక్కింపు జరిగిందని అందులో రూ.4472 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీ ద్వారానే సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.


