శ్రీరంగంలో ఉత్సవాలకు శ్రీకారం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ఉన్న తిరుచ్చి శ్రీరంగంలో పగల్ పత్తు ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉన్న తమిళనాట ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. ఇందులో తిరుచ్చి శ్రీరంగంలో కొలువుదీరిన శ్రీరంగనాథస్వామి ఆలయం వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇది భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ ప్రతి ఏడాది వైకుంఠఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. పగల్ పత్తు ఉత్సవాలకు ఉదయం శ్రీకారం చుట్టారు. అర్జున మండపంలో స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రతిరోజూ ఆలయంలో ప్రత్యేక వాహన సేవలు జరుగనున్నాయి. 30వ తేదీన స్వామి మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 9వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 5,6,7 తేదీల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలు అన్నీ వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధం అవుతున్నాయి. హిందూధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చైన్నెలోని ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయంలోనూ ఏర్పాట్లు మొదలయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పార్థసారథి ఆలయంలో ప్రత్యేక రుసుం సేవలను రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.


