కేంద్రమంత్రికి అవమానం
సాక్షి, చైన్నె : కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పుదుచ్చేరిలో శనివారం తీవ్ర పరాభావం ఎదురైంది. ఆయన్ని అక్కడి బీజేపీ నేతలు పట్టించుకోక పోవడంతో తీవ్ర అసహనం, ఆగ్రహంతో అర్ధ కిలోమీటరు మేరకు నడచుకుంటూ వెళ్లారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మనుసుఖ్ మండవీయాను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. తన పనులపై ఆయన దృష్టి పెట్టారు. ఇందు కోసం పుదుచ్చేరికి వచ్చారు. అదే సమయంలో పుదుచ్చేరికి బీజేపీ వర్కింగ్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్ సైతం వచ్చారు.
దీంతో ఆయనకు ఆహ్వానం పలికేందుకు పుదుచ్చేరి హోంమంత్రి నమశ్శివాయం, అక్కడి ముఖ్య నేతలు కల్యాణ సుందరంతో పాటు మన్సుఖ్ మాండవీయా గోరిమేడు వద్ద వేచి చూశారు. నితిన్ నబీన్ రావడంతో మంత్రిని అక్కడి బీజేపీ నేతలు మరిచారు. ఆయన్ని వదలి పెట్టి ఓపెన్ టాప్ వాహనంలో నితిన్ నబీన్‌ను ఎక్కించుకుని ఊరేగింపుగా వెళ్లి పోయారు. తనను ఒంటరిగా వదలి పెట్టడంతో మాన్సుఖ్ మాండవీయ తీవ్ర అసహనం, ఆగ్రహానికి లోనయ్యారు. కనీసం ఆయన కారు కూడా అక్కడ లేదు. కేంద్ర కేబినెట్ మంత్రికి కల్పించే భద్రత ఇదేనా అంటూ అక్కడి భద్రతా సిబ్బందిపై రుస రుసలాడారు. ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జాం కావడంతో చివరకు ఆయన అర్ధ కిలో మీటరు మేరకు జిప్మర్ ఆస్పత్రి వరకు నడుచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో ఆ మార్గంలో భద్రతా వాహనం ఒకటి రావడంతో ఆయన వెన్నంటి ఉన్న భద్రతా సిబ్బంది ఆ వాహనాన్ని ఆపి జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆ భద్రతా వాహనంలో కేంద్ర మంత్రిని ఎక్కించి పంపించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చైన్నెవిమానాశ్రయానికి వచ్చిన నితిన్ నబీన్‌కు ఇక్కడి బీజేపీ వర్గాలు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు.


