
మెట్రో మాల్
● తిరుమంగళంలో 9 అంతస్తులతో నిర్మాణం
● రెండు అంతస్తుల్లో రైల్వేస్టేషన్
● మరో రెండు అంతస్తుల్లో ట్రాక్
సాక్షి, చైన్నె: చైన్నెకు మరో ఐకానిక్‌గా నిలిచే రీతిలో మెట్రో రైల్వేస్టేషన్‌తో కూడిన మాల్ రూపదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నమూనాను మెట్రో రైలు యాజమాన్యం సిద్ధం చేసింది. తొమ్మిది అంతస్తులతో మూడు టవర్లుగా రూపుదిద్దుకునే ఈ మెట్రోమాల్ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.
చైన్నెలో ఫేజ్–1లో రెండు మార్గాల్లో జరుగుతున్న మెట్రో రైలు సేవలకు రోజురోజుకు స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫేజ్–2లో మరో మూ డు మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గాల్లో డ్రైవర్ రహిత మెట్రో సేవలకు కసరత్తులు చేసి, ట్రయల్‌రన్ విజయవంతంగా జరుగుతోంది. చైన్నె నగరం చుట్టూ మెట్రో రైలు సేవలు సాగే దిశగా భవిష్యత్తు కార్యాచరణను సైతం తీర్చిదిద్దారు. ఓ వైపు విమానాశ్రయం నుంచి శివారులోని కిలాంబాక్కం బస్ టెర్మినల్ వరకు, మరో వైపు పూందమల్లి నుంచి కాంచీపురం సమీపంలోని పరందూరు వైపు, ఇంకో వైపు కోయంబేడు నుంచి ఆవడి వైపు మెట్రో ప్రాజెక్టులకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ రైళ్లు, మెట్రో, ఎలక్ట్రిక్, ఎంఆర్‌టీఎస్ సేవలను అనుసంధానించేలా బ్రహ్మాండంగా ఓ టవర్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేశారు. 15,884 చదరపు అడుగుల విస్తీర్ణంలో 27 అంతస్తులతో బ్రహ్మాండ స్క్వేర్ రూపంలో ఈ టవర్‌ను తీర్చిదిద్దే దిశగా మెట్రో యాజమాన్యం కసరత్తుల వేగాన్ని పెంచింది. ఈ పరిస్థితుల్లో కోయంబేడు–అన్నానగర్‌కు మధ్యలోని తిరుమంగళం వద్ద బ్రహ్మాండ మెట్రో రైల్వేస్టేషన్‌తో కూడిన మాల్ రూపకల్పనకు కార్యాచరణ సిద్ధం చేశారు.
బ్రహ్మాండ మాల్ రూపంలో..
తిరుమంగళం వద్ద 6.85 లక్షల చదరపు అడుగుల స్థలంలో మెట్రో యాజమాన్యం నేతృత్వంలో బ్రహ్మాండ మాల్ రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే ప్రప్రథమంగా ఓ మాల్‌లోకి మెట్రో రైలు వెళ్లి వచ్చేలా, ఇక్కడే స్టేషన్ ఉండే దిశగా నిర్మాణాలు చేపట్టనున్నారు. పలు మార్గాలను అనుసంధానించేలా ఇక్కడ మెట్రో మార్గం, స్టేషన్ ఏర్పాటు కానున్నది. మొత్తం తొమ్మిది అంతస్తులతో ఏ,బీ,సీ పేర్లతో మూడు టవర్లుగా ఇక్కడ భవన నిర్మాణానికి నమూనా సిద్ధం చేశారు. ఇందులో రెండు అంతస్తులతో కూడినట్టుగా నాలుగో అంతస్తులో మెట్రో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఐదు, ఆరు అంతస్తుల్లో మెట్రో రైలు వచ్చి వెళ్లేందుకు ట్రాక్ ఏర్పాటు కానుంది. మిగిలిన అంతస్తులు, రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ వర్తక వాణిజ్య కేంద్రాలు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు నిర్మాణాలు, ఇతర మరిన్ని ప్రత్యేకతలను చేపట్టనున్నారు. అలాగే, కింది భాగంలో రెండు అంతస్తులతో పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. ఈ నమూనా ఆధారంగా త్వరలో టెండర్ల ప్రక్రియకు చర్యలు చేపట్టే దిశగా మెట్రో యాజమాన్యం ముందుకెళ్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.