సామరస్యం అంటే ఏమిటో?
● రాందాసు చమత్కారం ● పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం ● చైన్నెలో తిష్ట
సాక్షి, చైన్నె: సామరస్యం అంటే ఏమిటో అని మీడియా ప్రశ్నకు చమత్కారంతో కూడిన సమాధానాన్ని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఇచ్చారు. అన్బుమణి విభేదాల రూపంలో పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య నెలకొన్న విభేదాల గురించి తెలిసిందే. గురువారం అన్బుమణి తైలాపురం గెస్ట్‌హౌస్‌కు వెళ్లి రాందాసును కలిసి నిరాశతో వెళ్లారు. అధ్యక్ష పదవిని వదలుకునే స్థితిలో తాను లేనని అన్బుమణి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే, అధ్యక్ష పదవిని కూడా తానే చూసుకుంటానని రాందాసు తేల్చిచెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాందాసు పార్టీలో ఎవరెవరు తన వెన్నంటి ఉన్నారో అని తెలుసుకునే దిశగా భేటీలు విస్తృతం చేశారు.
ఈ పరిస్థితుల్లో శనివారం రాందాసు మీడియా దృష్టిలో పడ్డారు. మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. పరిస్థితులు పార్టీలో చక్కబడ్డట్టేనా అని మీడియ ప్రశ్నించగా ఏ పరిస్థితులు అని ఎదురు ప్రశ్న వేశారు. అన్బుమణితో సయోధ్య కుదిరినట్టేనా, అంతా సామరస్యమేనా అని ప్రశ్నించగా సామరస్యం అంటే ఏమిటో అని సమాధానం ఇచ్చారు. కాంప్రమైజ్ అయ్యారా అని ప్రశ్నించగా, అంటే ఎమిటో తనకు తెలియనప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. అన్బుమణితో విభేదాల కారణంగా పార్టీకి నష్టం లేదా అని ప్రశ్నించగా ఎలాంటి నష్టం లేదని, పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు. అన్బుమణితో భేటీ వివరాలను తర్వాత తెలియజేస్తాననని వ్యాఖ్యానించారు.
చైన్నెలో తిష్ట
గత కొన్ని నెలలుగా రాందాసు విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నారు. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు సాగించారు. వివాదాలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలల అనంతరం ఆయన తైలాపురం గెస్ట్‌హౌస్ నుంచి బయటకు వచ్చారు. చైన్నెకు చేరుకున్న ఆయన అన్బుమణి నివాసం ఉంటున్న పనయూరు శ్యామలా గార్డెన్‌కు పక్క వీధిలో ఉన్న తన కుమార్తె గాంధీమతి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ఉంటారు. ఆయన్ను అన్బుమణి, ఇతర కుటుంబసభ్యులు కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.


