మదురై వేదికగా అమిత్‌షా వ్యూహం
సాక్షి, చైన్నె: మదురై వేదికగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఆదివారం జరిగే బీజేపీ సెంట్రల్ కమిటీ భేటీకి హాజరు కానున్నారు. సాయంత్రం ఒత్తకడైలో జరిగే బహిరంగసభకు హాజరవుతారు. ముందుగా పలు పార్టీల నేతలు అమిత్‌షాను కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఫిబ్రవరి, మార్చి నెలలో అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు అధికారిక కార్యక్రమాల నిమిత్తం హాజరయ్యారు. ఏప్రిల్‌లో చైన్నెకు వచ్చిన ఆయన తన వ్యూహాలకు పదునుపెట్టి అన్నాడీఎంకేను దారిలోకి తెచ్చుకున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని ప్రకటించి వెళ్లారు. నెలన్నర తర్వాత మళ్లీ రాష్ట్ర పర్యటనకు అమిత్‌షా వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి మదురైకు వచ్చిన ఆయనకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి.
పలు పార్టీలకు ఆహ్వానం
మదురై నుంచి రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 22న మురుగన్ భక్తుల మహానాడుకు చర్యలు తీసుకున్నారు. ఇది కాస్త చర్చకు దారి తీసిన నేపథ్యంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ స్పందిస్తూ, ఇది బీజేపీ , సంఘ్ పరివార్ కార్యక్రమం కాదు అని, భక్తుల కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో తాజాగా అమిత్‌షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మదురైలో బీజేపీ సెంట్రల్ కమిటీలోని ప్రతినిధులు, పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇతర నేతలు పొన్ రాధాకృష్ణన్, రాజా, కర్పు మురుగానందనం, చక్రవర్తి, వానతీశ్రీనివాసన్, తమిళిసై సౌందరరాజన్ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కమిటీకి అమిత్‌షా వివరించనున్నారు. సాయంత్రం ఒత్తకడైలో జరిగే బహిరంగ సభ వేదిక నుంచి కేడర్‌ను పలకరించనున్నారు. అంతకుముందుగా అమిత్‌షాను ఎన్‌డీఏ కూటమిలో ఇదివరకు ఉన్న పలు పార్టీలకు చెందిన నాయకులు కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అన్నాడీఎంకే , బీజేపీ కూటమి ఏర్పడినానంతరం జరగనున్న తొలి బహిరంగసభ కావడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు ముఖ్యనేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఎన్‌డీఏ కూటమిలో లోక్ సభ ఎన్నికల్లో కొనసాగిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను అమిత్‌షాతో భేటీ కానున్నారా అని ప్రశ్నించగా ఏమి చేయాలో తెలియడం లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసును కదిలించగా, ఆలోచనేలేదని, తమకు ఎలాంటి ఆహ్వానం లేదని స్పష్టం చేశారు.
నేడు బీజేపీ సెంట్రల్ కమిటీ భేటీ
బహిరంగసభకు ఏర్పాట్లు
కూటమి పార్టీల నేతల భేటీకి చర్యలు


