
తుండు బీడీలో దక్షణ్ విజయ్
తమిళసినిమా: కథ, కథనాలు కొత్తగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఈ చిత్రాలను ఆదరిస్తారు. అలాంటి కథతో తెరకెక్కిన తాజా చిత్రం తుండు బీడీ. ఈ టైటిల్ చూడగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది కదూ. చిత్రం కూడా కొత్తగా ఉంటుందని నిర్మాత సి.బ్యూలామగిళ్ అంటున్నారు. ఈయన మగిళ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో దక్షణ్ విజయ్ కథానాయకుడిగా నటించారు. ఈయన ఇంతకుముందు కబాలీకరమ్, ఐ యామ్ వెయిటింగ్, మలయాళంలో ఇత్తికార కొంబన్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. నటుడు తలైవాసల్ విజయ్, సాయి దీనా, వనిత, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ మాదక ద్రవ్యాలు విక్రయించే ఒక వ్యక్తి వల్ల బాధింపునకు గురైన ఇద్దరు యువకులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని, వారి ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తుండుబీడీ అని చెప్పారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని తెలిపారు. చిత్రం ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈచిత్రానికి ఆర్.ప్రదీప్ చాయాగ్రహణం, సంజీవ్‌నాయుడు సంగీతాన్ని అందించినట్లు పేర్కొన్నారు.
దక్షణ్ విజయ్
రంభ