ఉమ్మడి పరిశోధనలపై ఐఐటీ మద్రాసు ఒప్పందం
సాక్షి, చైన్నె : టాంజానియా ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సర్టిఫికేషన్ కార్యక్రమాలను అందించడానికి, ఉమ్మడి పరిశోధనలను నిర్వహించడానికి , సాంకేతిక సంప్రదింపు ప్రాజెక్టులను అందించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జీఆర్‌ఐడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ మద్రాసు జాంజిబార్ ద్వారా ఆఫ్రికాలో చురుకై న ఉనికితో, స్థిరమైన శక్తి కోసం ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించడానికి తద్వారా కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన గ్రిడ్–ఇండియా, భారతదేశ విద్యుత్ గ్రిడ్‌లో నమ్మకమైన, సురక్షితమైన నిర్వహణకు బాధ్యత వహించే జాతీయ వ్యవస్థ ఆపరేటర్‌గా ఉన్నట్టు తెలిపారు. ఈ అవగాహన ఒప్పందంపై ఐఐటీ మద్రాస్ క్యాంపస్ డీన్ (ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్) ప్రొఫెసర్ మను శాంతానం, గ్రిడ్–ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్) శ్రీ సూరజిత్ బెనర్జీ సంతకం చేశారు.
దరఖాస్తులు
ఐఐటీఎం ప్రవర్తక్ ఆన్‌లైన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ సేల్స్ ఫోర్సు బీ2సీ కామర్స్ క్లౌడ్ కోర్సులకు ఐఐటీ మద్రాసు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సులు విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, నిపుణులను అత్యాధునిక నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తాయని ప్రకటించారు. ఈ వివరాలను ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీ వీర రాఘవన్ ప్రకటించారు. జూన్ 13వ తేదీలోపు ఆసక్తి గల వారు దరఖాస్తులుచేసుకోవాలని సూచించారు. జూన్ 14 నుంచి 60 గంటల ఆన్‌లైన్ కోర్సుగా విద్యాభాస్యం చేయడం జరుగుతుందన్నారు.
7న ఎమ్మెల్యేలతో భేటీ
సాక్షి, చైన్నె: డీఎంకే ఎమ్మెల్యేలతో ఈనెల 7వ తేదీ అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎంకే.స్టాలిన్ సమావేశం కానున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదేశించారు. అలాగే, జిల్లాల కార్యదర్శులతోనూ స్టాలిన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల పనులపై సమీక్షించనున్నారు.
కారు ఢీకొని కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
తిరుత్తణి: కారు ఢీకొని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. తిరుత్తణిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విగ్నేష్(28) విధులు నిర్వహిస్తున్నారు. గురువారం పొన్పాడి చెక్‌పోస్టులో వాహన తనిఖీ విధులు నిర్వరిస్తున్నారు. ఈసమయంలో వేగంగా వస్తున్న కారును అడ్డుకుని ఆపుతుండగా, వెనుక వైపు నుంచి వచ్చిన మరోకారు ఆగివున్న కారును ఢీకొంది. ఈప్రమాదంలో విఘ్నేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని అక్కడున్న వారు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతండ్రి గొంతు కోశాడు!
అన్నానగర్: రెండో పెళ్లికి ప్రయత్నించిన తండ్రి గొంతు కోసిన సంఘటన కలకలం రేపింది. సేలం, సూరమంగళం హైవే పక్కన ఉన్న మాణిక్వాసాగర్ వీధికి చెందిన సెల్వకుమార్ (65) తమిళనాడు అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఇతనికి భార్య షణ్ముగవల్లి, ఇద్దరు కుమారులు తమిళగన్ (23), గిరి వెంకటేష్ (17) ఉన్నారు. ఒక ప్రైవేట్ కళాశాలలో బి.కాం పూర్తి చేసిన తమిళగన్, కొండలాంపట్టిలో వాహన విడిభాగాలను విక్రయించే దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆయన రెండో కుమారుడు గిరి వెంకటేష్, ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్నాడు. షణ్ముగవల్లి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఈ స్థితిలో రెండేళ్ల క్రితం షణ్ముగవల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత సెల్వకుమార్ తన ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. ఈ స్థితిలో సెల్వకుమార్ రెండో వివాహం గురించి ఒక వార్తా పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కుమార్తె తమిళగన్ తన తండ్రిని అడిగాడు. గురువారం ఉదయం, వారు ఇంట్లో ఉన్నప్పుడు, తండ్రి, కొడుకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సెల్వకుమార్ తన కుమారుడు తమిళగన్‌ను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన తమిళగన్ కూడా ప్రతిగా దాడి చేశాడు. సెల్వకుమార్ తలపై తీవ్ర గాయమైంది. కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తితో అతను మెడను కూడా కోశాడు. సెల్వకుమార్ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అతన్ని రక్షించి సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన సెల్వకుమార్‌కు చికిత్స అందిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సూర మంగళం పోలీసులు తమిళగన్ అరెస్టు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.


