ఐఐటీ మద్రాసులోకి గిరిజన విద్యార్థిని
● సీఎం అభినందన ● విద్యా ఖర్చులన్నీ మాదేనని ప్రకటన
సాక్షి, చైన్నె: కల్వరాయన్ మలై అటవీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని విద్యలో ప్రతిభ కనబరిచి, ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకుంది. ఈ సమాచారంతో సేలం నగరానికి చెందిన రాజేశ్వరి అనే విద్యార్థినిని సీఎం ఎంకే స్టాలిన్ అభినందించారు. ఉన్నతవిద్య ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఐఐటీ మద్రాసులో సీటు దక్కాలంటే వివిధ పోటీ పరీక్షల్లో టాపర్ల జాబితాలో ముందు వరసులో చోటు దక్కించుకుని ఉండాలి. జాతీయ స్థాయిలోని విద్యా సంస్థల్లో గత తొమ్మిదేళ్లుగా తొలి స్థానాన్ని కై వశం చేసుకుంటూ వస్తున్న ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకునేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు ఎగబడుతుంటారు. ఆ దిశగా ఓ గిరిజన విద్యార్థిని ప్రతిభ కనబరిచి, ఐఐటీ మద్రాసు దరి చేరింది. సేలం జిల్లా కల్వరాయన్ మలై అటవీ ప్రాతంలోని కరుమందురై గ్రామానికి చెందిన ఆండి, కవిత దంపతులకు కుమార్తెలు జగదీశ్వరి, రాజేశ్వరి, పరమేశ్వరి, కుమారుడు గణేషన్ ఉన్నారు. ఆండి టైలర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చాడు. పెద్ద కుమార్తె జగదీశ్వరి సంగగిరిలోని ఓ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి చైన్నెలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన గణేషన్ తండ్రికి సహకారంగా టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. గత ఏడాది హఠాత్తుగా ఆండి మరణించాడు. తండ్రి మరణించిన పుట్టెడు శోకంతో రాజేశ్వరి ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమైంది.
ఐఐటీలో సీటు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 438 మార్కులు సాధించిన రాజేశ్వరి, ప్లస్‌టూలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 600 మార్కులకు గాను 521 మార్కులు దక్కించుకుంది. ఇంజినీరింగ్ చదవాలన్న ఆశతో పెరుంతురై ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో జేఈఈ శిక్షణ పొంది పరీక్ష రాసింది. రాజేశ్వరికి జాతీయ స్థాయిలో 417వ ర్యాంకు జేఈఈలో లభించింది. ఈ ర్యాంకు ఆధారంగా ఐఐటీ మద్రాసు ప్లేస్ మెంట్ సంపాదించుకుంది. ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకున్న కల్వరాయన్ కొండల్లోని అటవీ ప్రాంతానికి చెందిన గిరిజన విద్యార్థిని రాజేశ్వరి ఆ జాబితాలోకి చేరింది. ఈ సమాచారంతో ఆ విద్యార్థినిని పలువురు అభినందిస్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆనందం వ్యక్తం చేస్తూ రాజేశ్వరిని అభినందించారు. తండ్రిని కోల్పోయినప్పటికీ, ఆయన కలను సాకారం చేసేలా రాజేశ్వరి చదువుల తల్లిగా మారడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ బోర్డింగ్ స్కూల్ విద్యార్థిని విజయానికి సెల్యూట్ అని వ్యాఖ్యానించారు. రాజేశ్వరి ఉన్నత విద్యకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.


