
మేడవాక్కంలో బిగ్ లేక్ పునరుద్ధరణకు చర్యలు
● గ్రీన్ ఎకోలాజికల్ ఫారెస్టు లక్ష్యం
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని మేడవాక్కంలో ఉన్న వెల్లక్కల్ బిగ్ లేక్ పునరుద్ధరణ, బ్లూ–గ్రీన్ ఎకోలాజికల్ ఫారెస్ట్ రూపకల్పనకు రోటరీ క్లబ్ చర్యలు తీసుకుంది. 2014 నుంచి గ్రేటర్ చైన్నెలోని ఈ అతిపెద్ద చెరువును పునరుద్ధరించడానికి, పరిరక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ కలను సాకారం చేసే దిశగా ఓ ప్రాజెక్టును మేడవాక్కం పంచాయతీ అధ్యక్షుడు టి శివభూషణం రవి, యూనియన్ కౌన్సిలర్ బి.రవి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సినీ నటుడు ఆర్య, జిల్లా 3233 రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహావీర్ బోత్రా హాజరయ్యారు. భూగర్భజల స్థాయి పెంచడం, స్థానికంగా మొక్కల పెంపకంతో దట్టమైన బ్లూ–గ్రీన్ ఎకోలాజికల్ ఫారెస్ట్ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఒక్క రోజున పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా 3 వేలకు పైగా మొక్కలను నాటారు. రూ. 25 లక్షల విరాళంతో ఈప్రాజెక్టును తొలి విడతగా చేపట్టారు. చైన్నె క్యాపిటల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆర్‌టీఎన్ హేమంత్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కేవలం చెట్లను నాటడం లేదా సరస్సును పునరుద్ధరించడం గురించి మాత్రమే కాదని, వాతావరణ సమస్యలకు పరిష్కారం అని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె క్యాపిటల్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ మిడ్‌టౌన్, రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె సెంట్రల్ ఎలైట్, చైన్నె రోటరీ క్లబ్ స్నేహం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్టు తెలిపారు.