అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
కొరుక్కుపేట: భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, ఒడిస్సీ, మోహిణీ యాట్టం నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. ఆ ఆకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్, గురువు రోజా రాణి, ఆర్గనైజింగ్ డైరెక్టర్ దుర్గా నటరాజ్‌ల నేతృత్వంలో స్థానికంగా ఉన్న సాయిబాబా సన్నిధిలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాయినాథుడిని కీరిస్తూ సాగిన నృత్య ప్రదర్శనలో కళాకారులు తమదైన హావభావాలతో, అభినయంతో నాట్యం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రత్యేకించి రచయిత్రి జలంధర చంద్రమోహన్ రచించిన ఓం సాయి ఆత్మాయణం కథను ఆధారంగా చేసుకుని చంద్రమోహన్ కుమార్తె, గురువు డాక్టర్ మాధవి మల్లంపల్లి, వారి శిష్య బృందం కలసి కూచిపూడి నృత్యనాటక ప్రదర్శనతో కనువిందు చేశారు. అలా గే ఒడిస్సీ, మోహిణీయాట్టం నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా గురు వు రోజారాణి మాట్లాడుతూ సంగీత నృత్య కళలను పోషించడమే లక్ష్యంగా భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో పలు పుణ్యక్షేత్రా ల్లో కళాకారులతో భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిపారు. సాయిబాబా మందిరంలో ఎంతో అద్భుతమైన ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సాయిబాబా ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని నృత్యప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను సన్మానించారు.


