ఆర్థిక సంక్షోభానికి కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభానికి కుట్ర

Dec 22 2025 2:18 AM | Updated on Dec 22 2025 2:18 AM

ఆర్థి

ఆర్థిక సంక్షోభానికి కుట్ర

కేంద్రంపై సీఎం స్టాలిన్‌ ఫైర్‌ బీజేపీ గుణపాఠం నేర్పుదామని ప్రజలు పిలుపు తిరునల్వేలిలో ప్రగతి పనులకు శ్రీకారం

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందని సీఎం ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను అన్ని మార్గాలలో నిలుపుదల చేసి రాష్ట్రాన్ని స్తంభింప చేయడానికి, అదనపు భారాన్ని మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి పెద్ద గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వివరాలు.. సీఎం ఎంకే స్టాలిన్‌ శని, ఆదివారం తిరునల్వేలిలో పర్యటించారు. తొలి రోజున పోరునై మ్యూజియాన్ని ప్రారంభించారు. క్రిస్మస్‌ సంబరాలలో భాగస్వామ్యమయ్యారు. రెండో రోజైన ఆదివారం పాళయం కోట్టై ప్రభుత్వ వైద్య కళాశాల మైదానంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు. తిరునల్వేలి జిల్లాలో రూ. 235.94 కోట్ల వ్యయంతో పూర్తయిన 33 పనులను ప్రారంభించారు. రూ. 356.59 కోట్లతో కొత్తగా చేపట్టనున్న 11 పనులకు శంకుస్థాపన చేశారు రూ. 101.49 కోట్లు విలువైన సంక్షేమ పథకాలను 45,477 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌ ఎం. అప్పావు, మంత్రులు కేఎన్‌ నెహ్రు, ఏవీ వేలు, కె.కె.ఎస్‌.ఎస్‌.ఆర్‌. రామచంద్రన్‌, తంగం తెన్నరసు, గీతా జీవన్‌, ఆర్‌ రాజకన్నప్పన్‌, ఎం. సుబ్రమణియన్‌, మనో తంగరాజ్‌, పార్లమెంటు సభ్యులు కనిమొళి కరుణానిధి, రాణి శ్రీ కుమార్‌, రాబర్ట్‌ బ్రూస్‌, అబ్దుల్‌ వహార్‌ పాల్గొన్నారు.

విశిష్టతలతో...

తిరునల్వేలి విశిష్టతలతో ఈ వేడుకలో సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు. భాషోద్యమంలో పాళయం కోట్టై జైలులో కలైంజ్ఞర్‌ కరుణానిధితో పాటూ నేతలందరూ గడిపిన క్షణాలను గుర్తు చేశారు. నెల్లయప్పర్‌ ఆలయ విశిష్టతను గుర్తు చేస్తూ 700 సంవత్సరాల అనంతరం ఈ ఆలయాన్ని పునరుద్ధరించామన్నారు. ఈ ఆలయానికి బ్రహ్మాండ రథం రూపుదిద్దుకుంటోందని, ఇది జనవరి మొదటి వారంలో ఉపయోగంలోకి వస్తుందని ప్రకటించారు. ఇక, మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌గా గర్వంగా, గంభీరంగా ,విశాలవంతంగా, తమిళులకే గర్వకారణంగా పోరునై మ్యూజియం కొలువు దీరిందన్నారు. దేశ చరిత్ర తమళనాడు నుంచే మొదలైందని చాటే దిశగా ఇక్కడ చారిత్రక డేటా, పురావస్తు ఆధారాలు కొలువు దీర్చామని వివరించారు. భారత నాగరికతకు పుట్టినిల్లు, శిఖరం, తమిళనాడు అని ప్రకటించారు. ఇందుకు అనేక ఆధారాలు ఉన్నాయని గుర్తు చేశారు. సాహిత్యం మాత్రమే ఎప్పుడూ చారిత్రక ఆధారాలు కావు అని పేర్కొంటూ, శాసీ్త్రయంగా ధృవీకరించేందుకు పురావస్తు ఆధారాలను విస్తృతంగా సేకరించాలన సూచించారు. కీజాడిలో అనేక చారిత్రక అంశాలు వెలుగులోకి వచ్చినా కేంద్రం నుంచి సమాధానం కరువు అని విమర్శించారు. తమిళం, తమిళులపై తాజాగా ద్వేషంతో వ్యవహరించే వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఉనికిలో లేని సరస్వతి నది నాగరికతను వెతుక్కుంటూ తిరుగుతున్న వారి కళ్ళకు కీలడి అధ్యయనాలు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం..

2021 కేంద్ర బడ్జెట్‌లో ఆదిచ్చనల్లూరును మ్యూజియం అన్న ప్రకటన వెలువడిందని, అయితే, ఆ పని ఎంత వరకు వచ్చిందో ప్రజలు అక్కడకు వెళ్లి చూస్తే ఢిల్లీ పాలకుల తీరు స్పష్టం అవుతుందని ధ్వజమెత్తారు. పీఎం మోదీ, తమిళనాడుకు చెందిన మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఓమారు కీలడి మ్యూజియంను సందర్శిస్తే, తమిళ నాగరికత ఏమిటో వారికి స్పష్టం అవుతుందని హితవు పలికారు. తిరునల్వేలిలో చేపట్టనున్న కొన్ని ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా సీఎం వివరించారు. అన్నా ప్రభుత్వ మహిళా కళాశాలకు రూ. 16 కోట్లతో హాస్టల్‌ భవనం, చేరన్మాదేవిలో రూ. 4 కోట్లతో రైతుల కోసం కాంగేయన్‌ కాలువ నిర్మాణం, నంగునేరి, రాధాపురం సర్కిల్‌ రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తూ, వల్లియూర్‌లో రూ. 5 కోట్లతో నిర్మిస్తారని, వల్లియురాన్‌ కాలువను పునర్నిర్మించనున్నామని తెలిపారు. ఉన్నమహాత్మా గాంధీ ఉపాది హామీ పథకాన్ని తాజాగా సర్వనాశనం చేస్తున్నారని మండి పడ్డారు. దీనికి పేరు మార్చడమే కాదు,నిధులు మంజూరు చేయకుండా అడ్డుకునే వ్యూహంతో కేంద్రం ఉందని ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చిహ్నం మహాత్మా గాంధి అని పేర్కొంటూ, ఆయన పేరు తొలగించడం విచారకరంగా పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమిళనాడును అన్ని విధాలుగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ది దిశలో నడిపిస్తూ, దేశానికే నెంబర్‌ ఒన్‌ అని చాటుకుంటున్నామన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా, ప్రత్యర్థులు ఎన్ని వ్యూహాలు పన్నిననా వాటన్నింటిని ద్రావిడ మోడల్‌ చిన్నా భిన్నం చేసి తీరుతుందని, ద్రవిడ మోడల్‌ 2.ఓ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.

ఆర్థిక సంక్షోభానికి కుట్ర 1
1/1

ఆర్థిక సంక్షోభానికి కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement