వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడి కాలు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడి కాలు తొలగింపు

Jun 1 2025 1:16 AM | Updated on Jun 1 2025 1:16 AM

వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడి కాలు తొలగింపు

వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడి కాలు తొలగింపు

– న్యాయం చేయాలని

వైద్యశాల ఎదుట ఆందోళన

తిరువళ్లూరు: ప్రమాదానికి గురైన బాలుడికి చికిత్స చేయడంలో ప్రైవేటు ఆస్పత్రిలోని వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడి కాలు తొలగించాల్సి వచ్చిందని బాధితుడి బంధువులు వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌ ప్రాంతానికి చెందిన పార్థీబన్‌, కన్నమ్మాల్‌ దంపతుల కుమారుడు కిషోర్‌(12)కు గత 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు చికిత్స కోసం వెంటనే తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలుడ్ని పరిశీలించిన తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌ మురళీమనోజ్‌ ప్రాథమిక చికిత్స చేసి, కాకలూరు బైపాస్‌ రోడ్డులోని సన్‌షైన్‌ అనే ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్‌ చేసినట్టు తెలుస్తుంది. డాక్టర్‌ సూచన మేరకు బాలుడ్ని ప్రైవేటు వైద్యశాలకు తరలించి, అక్కడ సుమారు రూ.80 వేలు చెల్లించి, అపరేషన్‌ చేయించారు. అయితే అపరేషన్‌ చేసిన మరుసటి రోజే కాలు రంగు మారి నల్లబడడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై డాక్టర్‌ను సంప్రదించారు. కాలును పరిశీలించిన ప్రైవేటు వైద్యశాల డాక్టర్‌ ప్రభు, మళ్లీ తిరువళ్లూరు వైద్యశాలకు రెఫర్‌ చేశారు. అక్కడ బాలుడ్ని పరిశీలించిన వైద్యులు వెంటనే చైన్నెలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా చికిత్స మరింత ఆలస్యమవుతుందని భావించిన తల్లిదండ్రులు పూందమల్లిలోని సవిత వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించి, కాలును తొలగించారు. బాలుడి బంధువులు తిరువళ్లూరులోని ప్రైవేటు ఆస్పత్రి ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బాలుడికి నిర్లక్ష్యంగా చికిత్స అందించిన ప్రైవేటు వైద్యశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన బాలుడ్ని ప్రైవేటు వైద్యశాలకు రెఫర్‌ చేసిన డాక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవడంతో పాటు తమకు పరిహారం అందించాలని కోరారు. దాదాపు ఆరు గంటల పాటు చర్చల అనంతరం బాధితులు, ప్రైవేటు వైద్యశాల యాజమాన్యానికి పరస్పర అంగీకారం కుదరడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement